
న్యూఢిల్లీ: గత సంవత్సరం యూఏఈలో మ్యాచ్‌లు జరిపిన మాదిరిగానే భారత్‌లోనూ ఈ సారి ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించాలనుకున్న బీసీసీఐ ప్రయత్నాలు విఫలమయ్యాయి. పక్కాగా జాగ్రత్తలు తీసుకుని, బయోబబుల్‌లో ఉంచినప్పటికీ ఈ మహమ్మారి వైరస్ ఆటగాళ్లకి సోకింది. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో ప్లేయర్ కరోనా బారినపడ్డాడు. కేకేఆర్, భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది.
ఈ క్రమంలో కేకేఆర్ జట్టులో వైరస్ సోకిన ఆటగాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ కరోనా బారినపడ్డారు. కాగా, ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్, ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ప్రసిద్ద్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఐపీఎల్ వాయిదాకి వరుణ్ చక్రవర్తి కారణమంటూ సోషల్ మీడియాలో అతనిపై మీమ్స్ చేస్తూ అభిమానులు వాళ్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
( చదవండి : IPL 2021: నీ వల్లే ఐపీఎల్ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్! )