ముంబై: గతేడాది ఐపీఎల్ సీజన్‌లో ఆద్యంతం దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయి చతికిలపడింది. ఒక జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆకట్టుకుంటే.. ఆ జట్టు యువ ఆటగాడు పృథ్వీ షాకు మాత్రం నిరాశనే మిగిల్చింది. ఢిల్లీ తరపున గతేడాది 13 మ్యాచ్‌లాడిన అతను 228 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సీజన్‌లో అతని అత్యధిక స్కోరు 66గా ఉంది. ఆ తర్వాత ఆసీస్ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా డకౌట్ అవ్వడం.. రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులే చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్ రాని ఒక ఆటగాడిని తీసుకొచ్చి ఓపెనర్ స్థానంలో ఆడించడమేంటంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ దెబ్బతో పృథ్వీ షా ఆసీస్ సిరీస్‌లో మరో మ్యాచ్ ఆడే అవకాశం రాకుండా పోయింది.
అయితే ఆ తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోపీలో మాత్రం పృథ్వీ షా దుమ్మురేపే ప్రదర్శన చేశాడు. నాలుగు శతకాలతో రెచ్చిపోయిన అతను టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి తిట్టినవాళ్ల చేతే శెభాష్ అనిపించుకున్నాడు. కాగా 2021 ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కేతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే పృథ్వీ షా తన విలువేంటో చూపించాడు. 38 బంతుల్లోనే 72 పరుగులు చేసిన పృథ్వీ ఢిల్లీ ఆ మ్యాచ్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ గురించి పృథ్వీ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాంటింగ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. గతేడాది సీజన్‌లో నేను విఫలమైనప్పుడు నా వెన్నంటి ఉండి ప్రోత్సహించాడు. ఆయన మార్గదర్శనంలో పనిచేయడం గొప్ప అనుభూతి. ఆసీస్ తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన పాంటింగ్‌కు అనుభవం ఎక్కువ.. అందేకే అతనిచ్చే సలహాలు.. ఐడియాలు మాలాంటి యువ ఆటగాళ్లకు ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడడానికి ముందు నా బ్యాటింగ్‌లో చిన్నపాటి మార్పులు చేసుకున్నాను. గతేడాది సీజన్‌లో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఉండేందుకు ప్రాక్టీస్ చేశాను. అంతకముందు విజయ్ హజారే ట్రోపీ ఆరంభానికి ముందు నా కోచ్‌లు రజనీకాంత్ శివగ్నానమ్, ప్రవీణ్ ఆమ్రే వద్ద సలహాలు తీసుకోవడం కూడా బాగా ఉపయోగపడింది. విజయ్ హజారే ట్రోపీలో రాణించడం వెనుక కారణం కూడా అదే అంటూ ముగించాడు. కాగా సీఎస్‌కేపై విజయంతో ఉత్సాహంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరికొద్ది సేపట్లో రాజస్తాన్ రాయల్స్‌ను ఎదుర్కొనబోతుంది.
చదవండి: ఆ స్థానంలో వస్తే ఆరెంజ్ క్యాప్ ఎలా వస్తుంది!
Comments
Please login to add a commentAdd a comment