IPL 2021, DC vs RR: మోరిస్‌ మ్యాజిక్‌ | IPL 2021: Rajasthan Royals beat Delhi Capitals by 3 wickets | Sakshi
Sakshi News home page

IPL 2021, DC vs RR: మోరిస్‌ మ్యాజిక్

Published Fri, Apr 16 2021 4:59 AM | Last Updated on Fri, Apr 16 2021 12:07 PM

Rajasthan Royals beat Delhi Capitals by 3 wickets - Sakshi

ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో క్రిస్‌ మోరిస్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 16 కోట్ల 25 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా గుర్తింపు పొందిన మోరిస్‌ తనపై ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో మోరిస్‌ మ్యాజిక్‌ చేశాడు. కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌ ఆడిన మోరిస్‌ ఢిల్లీ చేతిలో ఉన్న మ్యాచ్‌ను      రాజస్తాన్‌ రాయల్స్‌ వైపునకు తిప్పేశాడు. చివరి రెండు ఓవర్ల వరకు గెలుపు దిశగా సాగిన ఢిల్లీ జట్టు మోరిస్‌ విధ్వంసంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఓటమిని ఖాయం చేసుకుంది.   

ముంబై: ఐపీఎల్‌ తాజా సీజన్‌ మరో థ్రిల్లింగ్‌ మ్యాచ్‌కు వేదికైంది. అయితే గత రెండు మ్యాచ్‌లకు భిన్నంగా ఈ మ్యాచ్‌లో ఛేజింగ్‌ చేసిన జట్టు గెలిచింది. కానీ, ఒకటి మాత్రం గత రెండు మ్యాచ్‌ల్లోలాగే జరిగింది. అదే ఓడిపోతుందనకున్న జట్టు చివరికి గెలవడం. గురువారం వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ 3 వికెట్ల తేడాతో నెగ్గి సీజన్‌లో బోణీ కొట్టింది.

చివరి రెండు ఓవర్లో రాజస్తాన్‌ విజయానికి 27 పరుగులు అవసరం కాగా... మోరిస్‌ (18 బంతుల్లో 36 నాటౌట్‌; 4 సిక్స్‌లు) అద్భుత ఆటతీరుతో జట్టును గెలిపించాడు. రబడ వేసిన 19వ ఓవర్లో క్రిస్‌ మోరిస్‌ రెండు సిక్సర్లతో కలిపి 15 పరుగులు సాధించాడు. దాంతో రాజస్తాన్‌ విజయ సమీకరణం 6 బంతుల్లో 12 పరుగులుగా మారింది. చివరి ఓవర్‌ వేసిన టామ్‌ కరన్‌ బౌలింగ్‌లో మోరిస్‌ వరుసగా 2, 6, 0, 6 కొట్టి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. జైదేవ్‌ ఉనాద్కట్‌ (7 బంతుల్లో 11 నాటౌట్‌; సిక్స్‌)తో కలిసి మోరిస్‌ ఎనిమిదో వికెట్‌కు 3.5 ఓవర్లలో 46 పరుగుల భాగస్వామ్యం జోడించాడు.  

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (32 బంతుల్లో 51; 9 ఫోర్లు) మినహా మిగతా వారు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జైదేవ్‌ ఉనాద్కట్‌ (3/15) బంతితో ప్రత్యర్థిని కట్టడి చేయగా... ముస్తఫిజుర్‌ రహమాన్‌ (2/29) అతడికి సహకారం అందించాడు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 19.4 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసి గెలుపొందింది. డేవిడ్‌ మిల్లర్‌ అర్ధ సెంచరీతో (43 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అవేశ్‌ ఖాన్‌ (3/32), వోక్స్‌ (2/22), రబడ (2/30) తొలుత హడలెత్తించినా... చివరికి మోరిస్‌ విధ్వంసానికి చేతులెత్తేశారు.  

ఉనాద్కట్‌ సూపర్‌ స్పెల్‌
పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అవకాశం రాని జైదేవ్‌ ఉనాద్కట్‌ ఈ మ్యాచ్‌లో అదిరే బౌలింగ్‌తో అదరొట్టాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శతక భాగస్వామ్యంతో అలరించిన ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా (2), ధావన్‌ (9)లను అవుట్‌ చేయడంతోపాటు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ రహానే (8)ని రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. ఇందులో ధావన్‌ కొట్టిన స్కూప్‌ షాట్‌ను కీపర్‌ సామ్సన్‌ తన కుడివైపునకు డైవ్‌ చేస్తూ పట్టిన క్యాచ్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

తన మొదటి స్పెల్‌ల్లో మూడు ఓవర్లు వేసిన ఉనాద్కట్‌ కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక ఢిల్లీ వికెట్లను నేలకూల్చడంతో రాజస్తాన్‌కు ఘనమైన ఆరంభం దక్కింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సారథి పంత్‌ మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 36/3గా నిలిచింది. పవర్‌ప్లే అనంతరం కూడా ఢిల్లీ వికెట్ల పతనం ఆగలేదు. ఏడో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన ముస్తఫిజుర్‌ ఒక స్లో డెలివరీ బంతితో స్టొయినిస్‌ (0)ను బోల్తా కొట్టించాడు. దాంతో ఢిల్లీ కష్టాలు ఎక్కువయ్యాయి.  

పంత్‌ ఫిఫ్టీ...
అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన పంత్‌ 11వ ఓవర్‌లో ఒక్కసారిగా జూలు విదిల్చాడు. తెవాటియా వేసిన ఆ ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 2, 2, 4 సాధించి 20 పరగులను రాబట్టాడు. దాంతో అప్పటి వరకు 6 కంటే తక్కువగా ఉన్న రన్‌రేట్‌ ఒక్కసారిగా 7ను అందుకుంది. మరుసటి ఓవర్లో మరో ఫోర్‌ సాధించిన పంత్‌... 30 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఇక పంత్‌ నుంచి ధనాధన్‌ ఇన్నింగ్స్‌ షురూ అయిందని అనుకునేలోపే లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు.

12వ ఓవర్‌ నాలుగో బంతిని లెగ్‌ సైడ్‌ ఆడిన పంత్‌ పరుగు కోసం వెళ్లగా... బంతిని అందుకున్న పరాగ్‌ నేరుగా వికెట్లను గిరాటేశాడు. దాంతో లలిత్‌ యాదవ్‌ (24 బంతుల్లో 20; 3 ఫోర్లు)తో కలిసి నెలకొల్పిన 51 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. చివర్లో టామ్‌ కరన్‌ (16 బంతుల్లో 21; 2 ఫోర్లు), వోక్స్‌ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), రబడ (4 బంతుల్లో 9; 1 ఫోర్‌) కాస్త పోరాడటంతో... ఢిల్లీ చివరి 4 ఓవర్లలో 40 పరుగులు సాధించింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్‌ లేకపోవడం విశేషం.

ఢిల్లీ బౌలర్ల దూకుడు...
పిచ్‌ స్వింగ్‌కు అనుకూలిస్తుండటంతో ఢిల్లీ పేసర్లు ఆరంభం నుంచే రెచ్చిపోయారు. ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌ వేయడానికి బంతిని అందుకున్న వోక్స్‌ దూకుడు కనబర్చాడు. రాజస్తాన్‌ ఓపెనర్లు మనన్‌ వొహ్రా (9), జోస్‌ బట్లర్‌ (2)లను బంతి వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన రబడ... గత మ్యాచ్‌ సెంచరీ హీరో సంజూ సామ్సన్‌ (4)ను అవుట్‌ చేయడంతో 4 పరుగుల తేడాతో మూడు వికెట్లను చేజార్చుకున్న రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ కూడా కష్టాలతోనే మొదలైంది. ఇక తన వంతంటూ బౌలింగ్‌కు వచ్చిన అవేశ్‌ ఖాన్‌ తన వరుస ఓవర్లలో క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడిన దూబే (2), పరాగ్‌ (2)లను పెవిలియన్‌కు పంపాడు. దాంతో 10 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ 52/5గా నిలిచింది.  

పోరాడిన మిల్లర్‌...
ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో ఓపిగ్గా ఆడిన మిల్లర్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ నుంచి బ్యాట్‌కు పని చెప్పాడు. ఆ ఓవర్‌లో హ్యాట్రిక్‌ బౌండరీలు కొట్టడంతో పాటు... మరుసటి ఓవర్లో మరో రెండు ఫోర్లు బాది రాజస్తాన్‌ను లక్ష్యం వైపు నడిపించాడు. మరోపక్క నిలకడగా ఆడిన తెవాటియా (17 బంతుల్లో 19; 2 ఫోర్లు) అనవసరపు షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌ చేరాడు. దాంతో మిల్లర్, తెవాటియాల 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

చేయాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ ఉండటంతో దూకుడుగా ఆడటానికి మొగ్గు చూపిన మిల్లర్‌ 40 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్, స్క్వేర్‌ లెగ్‌ల మీదుగా రెండు సిక్సర్లను బాదిన డేవిడ్‌ మిల్లర్‌... హ్యాట్రిక్‌ సిక్సర్‌ను కొట్టబోయి లాంగాన్‌లో లలిత్‌ యాదవ్‌ చేతికి చిక్కాడు. దాంతో మిల్లర్‌ పోరాటం ముగిసింది. అయితే చివర్లో దూకుడుగా ఆడిన మోరిస్, ఉనాద్కట్‌తో కలిసి రాజస్తాన్‌ రాయల్స్‌కు విజయాన్ని అందించాడు.  

స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) మిల్లర్‌ (బి) ఉనాద్కట్‌ 2; ధావన్‌ (సి) సామ్సన్‌ (బి) ఉనాద్కట్‌ 9; రహానే (సి అండ్‌ బి) ఉనాద్కట్‌ 8; పంత్‌ (రనౌట్‌) 51; స్టొయినిస్‌ (సి) బట్లర్‌ (బి) ముస్తఫిజుర్‌ 0; లలిత్‌ యాదవ్‌ (సి) తెవాటియా (బి) మోరిస్‌ 20; టామ్‌ కరన్‌ (బి) ముస్తఫిజుర్‌ 21; క్రిస్‌ వోక్స్‌ (నాటౌట్‌) 15; అశ్విన్‌ (రనౌట్‌) 7; రబడ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 147.
వికెట్ల పతనం: 1–5; 2–16, 3–36, 4–37, 5–88, 6–100, 7–128, 8–136.
బౌలింగ్‌: చేతన్‌ సకారియా 4–0–33–0; జైదేవ్‌ ఉనాద్కట్‌ 4–0–15–3; మోరిస్‌ 3–0–27–1; ముస్తఫిజుర్‌ రెహమాన్‌ 4–0–29–2; రియాన్‌ పరాగ్‌ 2–0–16–0; రాహుల్‌ తెవాటియా 3–0–27–0.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (సి) పంత్‌ (బి) వోక్స్‌ 2; మనన్‌ వొహ్రా (సి) రబడ (బి) వోక్స్‌ 9; సంజూ సామ్సన్‌ (సి) ధావన్‌ (బి) రబడ 4; శివమ్‌ దూబే (సి) ధావన్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 2; డేవిడ్‌ మిల్లర్‌ (సి) లలిత్‌ యాదవ్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 62; రియాన్‌ పరాగ్‌ (సి) ధావన్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 2; రాహుల్‌ తెవాటియా (సి) లలిత్‌ యాదవ్‌ (బి) రబడ 19; మోరిస్‌ (నాటౌట్‌) 36; జైదేవ్‌ ఉనాద్కట్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.4 ఓవర్లలో 7 వికెట్లకు) 150.
వికెట్ల పతనం: 1–13, 2–13, 3–17, 4–36, 5–42, 6–90, 7–104.
బౌలింగ్‌: వోక్స్‌ 4–0–22–2; అవేశ్‌ ఖాన్‌ 4–0–32–3; రబడ 4–0–30–2; అశ్విన్‌ 3–0–14–0; టామ్‌ కరన్‌ 3.4–0–35–0; స్టొయినిస్‌ 1–0–15–0. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement