సామ్సన్‌.. నా బ్యాటింగ్‌ చూడు! | IPL 2021: Chris Morris Stunning Knock Help To Rajasthan Victory | Sakshi
Sakshi News home page

సామ్సన్‌.. నా బ్యాటింగ్‌ చూడు!

Published Fri, Apr 16 2021 7:21 AM | Last Updated on Fri, Apr 16 2021 12:09 PM

IPL 2021: Chris Morris Stunning Knock Help To Rajasthan Victory - Sakshi

Photo Courtesy: BCCI

ముంబై: క్రిస్‌ మోరిస్‌కు రూ.16 కోట్లకు పైగా వెచ్చించి ఎందుకు తీసుకున్నారు అనేది ఇప్పటిదాకా ప్రతి ఒక్కరి మదిలో మెదిలిన ప్రశ్న. భారీ ధర పెట్టి కొన్న మోరిస్‌ అసలు రాజస్థాన్‌కు ఏమైనా ఉపయోగపడతాడా? అని విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్వక్తం చేశారు. దానికి సరైన సమాధానం తన బ్యాట్‌తోనే చెప్పాడు మోరిస్‌. ఢిల్లీ క్యాపిటల్స్‌ తో గురువారం జరిగిన మ్యాచ్‌లో మోరిస్‌ చిర్రెత్తినట్లు బ్యాటింగ్‌ చేశాడు. క్రీజ్‌లో కుదరుకోవడానికి పెద్దగా సమయం తీసుకోని మోరిస్‌.. ఆ తర్వాత భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

18 బంతుల్లో 4 సిక్సర్లతో 36 పరుగులు సాధించి రాజస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తనపై ఆశలు పెట్టుకున్న రాజస్థాన్‌కు చక్కని విజయం అందించి హీరో అయ్యాడు. ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్‌ నిర్ధేశించిన 222 పరుగుల టార్గెట్‌కు అతి దగ్గరగా వచ్చి పరాజయం చెందింది రాజస్థాన్‌. 20వ ఓవర్‌ ఆఖరి బంతికి ఫోర్‌ కొడితే రాజస్థాన్‌ గెలిచే స్థితిలో సంజూ భారీ షాట్‌ కాస్తా క్యాచ్‌ కావడంతో ఓటమి తప్పలేదు. ఆ ముందు బంతికి సంజూ సింగిల్‌ తీసే అవకాశాన్ని వద్దనుకున్నాడు. తాను సెట్‌ అయిన బ్యాట్స్‌మన్‌ కావడంతో అవతలి ఎండ్‌లో  ఉన్న మోరిస్‌కు అవకాశం ఇవ్వలేదు. సింగిల్‌ తీసే అవకాశాన్ని సంజూ కాదనడంతో నాన్‌స్టైకింగ్‌ ఎండ్‌లో  ఉన్న మోరిస్‌ కూడా తన భావాల ద్వారా ఆశ్చర్యం  వ్యక్తం చేశాడు.

తాను కూడా బ్యాట్స్‌మన్‌నే కదా.. సింగిల్‌ తీసే ఉంటే ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టలేనా అని మోరిస్‌ మనసులో  కచ్చితంగా అనుకునే ఉంటాడు.  ఆ అవకాశం తదుపరి మ్యాచ్‌లోనే వచ్చింది. ‘మొన్న చాన్స్‌ రాలేదు... ఈసారి వదలకూడదు’  అనే కసితో మోరిస్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. ఏకంగా రబడా వేసిన 19 ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన మోరిస్‌.. ఆపై టామ్‌ కరాన్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో కూడా రెండు సిక్స్‌లు సాధించి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే రాజస్తాన్‌కు విజయాన్ని అందించాడు మోరిస్‌.

మోరిస్‌ బ్యాటింగ్‌ చేస్తున్నంతసేపు ఇటు రాజస్థాన్‌ రాయల్స్‌ శిబిరంలో ఆనందం, అటు ఢిల్లీ క్యాపిటల్స్‌ శిబిరంలో ఆందోళన. అప్పటివరకూ మిల్లర్‌ (62; 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరవిహారంం చేసి ఢిల్లీకి వణికిపుట్టిస్తే, ఆ తర్వాత మోరిస్‌ మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు. మిల్లర్‌ను పెవిలియన్‌కు పంపామన్న ఆనందం క్షణాల్లో ఆవిరయ్యేలా చేశాడు మోరిస్‌.  ఇక తన కెప్టెన్‌ సంజూ సామ్సన్‌కు కూడా పరోక్షంగా తన బ్యాటింగ్‌ ఇది అంటూ సంకేతాలు పంపాడు మోరిస్‌. తాను రాహుల్‌ తెవాతియా కంటే కింది స్థానంలో వచ్చినా తన క్లాస్‌ ఏమిటో రాజస్థాన్‌ యాజమాన్యానికి చూపించాడు.

మోరిస్‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రాగా, అప్పటికీ రాజస్థాన్‌ లొంగిపోయినట్లే కనబడింది. మోరిస్‌పై పెద్దగా నమ్మకం లేని రాజస్థాన్‌ కింది స్ధానంలో అతన్ని బ్యాటింగ్‌కు పంపింది. కానీ తన మీద ఎంతో బాధ్యత ఉందని గ్రహించిన మోరిస్‌.. తనకు వెచ్చించిన మొత్తాన్ని కూడా మనసులో తలచుకునే ఉంటాడు. తనకు వచ్చిన అవకాశాన్ని ఈ మ్యాచ్‌లో ఉపయోగించుకోలేకపోతే మళ్లీ రాకపోవచ్చనే కసితో ఆడాడు. దాంతో రాజస్థాన్‌ ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి గెలుపు తీరాలకు చేరింది. ఇక నుంచి మోరిస్‌ను బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా కంటే బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా రాజస్థాన్‌ చూడక తప్పదు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మోరిస్‌కు ప్రమోషన్‌ ఇచ్చే అంశాన్ని కూడా రాజస్థాన్‌ కచ్చితంగా ఆలోచించాల్సిందే. 

ఇక్కడ చదవండి: RCB VS SRH‌: అరిచి అరిచి నా గొంతు పోయింది

అతనికి కోహ్లి ఒక గొప్ప ఆస్తి: బ్రెట్‌ లీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement