
PC: IPL
IPL 2022 Auction: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్- 2022 మెగా వేలం నిర్వహణ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అదే విధంగా వేదిక సైతం బెంగళూరు నుంచి మార్చనున్నట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వ తాజా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వేదిక మార్పు తప్పనిసరి అయితే... కోల్‌కతా, కొచ్చి, ముంబైలలో ఏదో ఒక నగరంలో వేలం నిర్వహించాలని భావించినా ఆయా చోట్ల కూడా కరోనా కేసుల్లో పెరుగదల కారణంగా ఆలోచన మార్చుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించినట్లుగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో కాకుండా కొత్త తేదీలను ఖరారు చేసే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.
తాజా కోవిడ్ నిబంధనల కారణంగా హోటళ్లలో గదులు బుకింగ్ ఆలస్యమవుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ విషయాల గురించి బీసీసీఐ సీనియర్ అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ... ‘‘మన చేతుల్లో ఏమీ ఉండదు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వేచిచూడక తప్పదు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం.
ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల అధికారులతో మాట్లాడుతున్నాం. ఒకవేళ వేదిక మార్చాల్సి వస్తే తప్పక అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తాం’’అని పేర్కొన్నారు. కాగా ప్రొ కబడ్డి లీగ్ బెంగళూరులో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ వైట్‌ఫీల్డ్ హోటల్‌లోని షెరాటన్ గ్రాండ్‌ను నిర్వాహకులు ఉపయోగించుకుంటున్నారు.
మిగతా హోటళ్లు అందుబాటులో ఉన్నా గురువారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో సామూహిక సమావేశాలకు అనుమతి కష్టంగానే మారనుంది. ఇక ఐపీఎల్ మెగా వేలం అంటేనే వందల సంఖ్యలో అధికారులు హాజరవుతారు. కాబట్టి కర్ణాటక ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వేదిక మార్చాలా వద్దా అన్న అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది.
చదవండి: IPL 2022: వదిలేసినా ఆ జట్టుకే ఆడాలని కోరుకుంటున్నారు... వేలంలోనైనా!
Comments
Please login to add a commentAdd a comment