కేఎల్ రాహుల్ సారధ్యం వహించనున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు.. తమ ఫ్రాంచైజీ లోగోను సోమవారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. లగోను రూపొందించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రణాళికా బద్దంగా డిజైన్ చేశామని ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా వెల్లడించారు. అయితే, లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) లోగోలో ఓ పెద్ద పొరపాటు దొర్లిందని, బడా బిజినెస్ మ్యాన్ అయిన సంజీవ్ గొయెంకా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
వివరాల్లోకి వెళితే.. గరుడ పక్షిని పోలి ఉన్న ఎల్‌ఎస్‌జీ లోగోను త్రివర్ణ పతాకంలోని మూడు రంగులతో(కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) కూడిన రెక్కలు, మధ్యలో బంతి, బ్యాట్ ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించారు ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా. ఇదంతా బాగానే ఉన్నా లోగోలో ఓ పొరపాటు కొట్టొచ్చినట్లు కనిపించింది. క్రికెట్‌లో ఫార్మాట్‌ను బట్టి బంతి రంగు మారుతుందన్న లాజిక్‌ను మిసయ్యాడు గొయెంకా. ఐసీసీ రూల్స్ ప్రకారం టెస్ట్ క్రికెట్‌లో ఎరుపు రంగు బంతి, డే అండ్ నైట్ టెస్ట్‌లకు పింక్ కలర్ బంతి, వన్డే, టీ20లకు తెలుపు రంగు బంతిని ఉపయోగిస్తారు. అయితే, ఎల్‌ఎస్‌జీ లోగోలో తెలుపు రంగు బంతి స్థానంలో ఎరుపు బంతి కనిపించడం ట్రోలింగ్‌కు కారణమైంది. ఐపీఎల్.. టీ20 టోర్నీ అనుకుంటున్నారా లేక టెస్ట్ క్రికెట్ అనుకుంటున్నారా అంటూ పంచ్‌లు వేస్తున్నారు నెటిజన్లు.
కాగా, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా అరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. లక్నో జట్టు రూ. 17 కోట్లు పెట్టి కేఎల్ రాహుల్‌ను సారథిగా నియమించుకోగా.. అహ్మదాబాద్ రూ. 15 కోట్లు వెచ్చించి హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకుంది. లక్నో జట్టు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌కి రూ.9.2 కోట్లు, పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కి 4 కోట్లు చెల్లించి సొంతం చేసుకోగా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రషీద్ ఖాన్‌కు 15 కోట్లు, శుభ్‌మన్ గిల్‌ను 8 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో జట్టుకు కోచ్‌గా ఆండీ ఫ్లవర్ వ్యవహరించనుండగా.. మెంటార్‌గా గౌతం గంభీర్ నియమితుడయ్యాడు. మరోవైపు అహ్మదాబాద్.. తమ కోచ్‌గా ఆశిష్ నెహ్రాను, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టన్‌ను నియమించుకుంది.
చదవండి: IPL 2022: అందుకే గరుడ పక్షి, త్రివర్ణాలు, నీలం రంగు బ్యాట్: లక్నో
Comments
Please login to add a commentAdd a comment