IPL 2023, MI Vs RR: Aakash Chopra Lauds Suryakumar, Earlier There Was A Solar Eclipse But Now The Sun Is Shining - Sakshi
Sakshi News home page

#Suryakumar Yadav: గ్రహణం వీడింది.. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు! అతడు భవిష్యత్‌ సూపర్‌స్టార్‌.. సందేహమే లేదు!

Published Mon, May 1 2023 12:30 PM | Last Updated on Tue, May 2 2023 9:49 AM

IPL 2023 Aakash Chopra Lauds Suryakumar: Earlier There Was Solar Eclipse - Sakshi

సూర్యకుమార్‌ యాదవ్‌ (PC: IPL/BCCI)

IPL 2023- MI Vs RR: రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. చాన్నాళ్ల తర్వాత తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడీ టీ20 నంబర్‌ 1 బ్యాటర్‌. ఐపీఎల్‌-2023లో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలిసారి అర్ధ శతకం సాధించిన ఈ మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌.. తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లోనూ అదరగొట్టి అభిమానులకు కనువిందు చేశాడు.

అదరగొట్టేశాడు
వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సూర్య 29 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. 

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా సూర్యకుమార్‌ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఫామ్‌లోకి వచ్చిన సూర్య ఆటతీరును ఇలాగే కొనసాగిస్తే జట్టుకు తిరుగు ఉండదని పేర్కొన్నాడు. అదే విధంగా ముంబై- రాజస్తాన్‌ మ్యాచ్‌ ఫలితాన్ని తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా విశ్లేషిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

సూర్య గ్రహణం వీడింది..
‘‘ముంబై లక్ష్య ఛేదన అంత సులువుగా ఏమీ జరిగిపోలేదు. సూర్యకుమార్‌ యాదవ్‌ పూర్తి ఫామ్‌లోకి వచ్చాడు. మునుపటి లయను అందుకున్నాడు. ఇన్నాళ్లు.. సూర్యగ్రహణం పట్టింది.. ఇప్పుడిప్పుడే గ్రహణం వీడి సూర్యుడు ప్రకాశించడం మొదలుపెట్టాడు. నిజానికి ఈరోజు రోహిత్‌ శర్మ తొందరగా అవుటైపోయాడు. తన పుట్టినరోజు అయినప్పటికీ సెలబ్రేట్‌ చేసుకోలేకపోయాడు.

మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ పర్వాలేదనిపించాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అలాంటి క్లిష్ట సమయంలో కామెరాన్‌ గ్రీన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి పట్టుదలగా నిలబడ్డాడు. కామెరాన్‌ గ్రీన్‌ భవిష్యత్‌ సూపర్‌స్టార్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అతడు భవిష్యత్‌ సూపర్‌స్టార్‌
మానసికంగా.. శారీరకంగా అతడు ఫిట్‌నెస్‌ కాపాడుకోగలిగితే కచ్చితంగా రాక్‌స్టార్‌గా వెలుగొందుతాడు. తనదొక విభిన్న శైలి. తను అద్బుతంగా బౌలింగ్‌ కూడా చేయగలడు. గ్రీన్‌ ఒక సంచలనం అనడంలో అతిశయోక్తి లేదు’’ అని ఆకాశ్‌ చోప్రా ముంబై బ్యాటర్ల ఆటను విశ్లేషిస్తూ.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్రీన్‌ను ఆకాశానికెత్తాడు.

కాగా సొంతమైదానంలో రాజస్తాన్‌తో తలపడ్డ ముంబై మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థి విధించిన 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదింది. తద్వారా ఈ సీజన్‌లో నాలుగో విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 3 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. ఇషాన్‌ 28 పరుగులు సాధించాడు.

టిమ్‌ డేవిడ్‌ విధ్వంసం
వన్‌డౌన్‌లో వచ్చిన గ్రీన్‌ 26 బంతుల్లో 44 పరుగులు చేయగా.. తిలక్‌ వర్మ 29, టిమ్‌ డేవిడ్‌ 45 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. చివరి ఓవర్లో మొదటి మూడు బంతుల్లో టిమ్‌ డేవిడ్‌ వరుసగా మూడు సిక్సర్లు బాది ముంబై గెలుపును ఖరారు చేశాడు. ఇదిలా ఉంటే.. సూర్యకుమార్‌ యాదవ్‌ ఐపీఎల్‌ పదహారో ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో కలిపి 201 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 57.

ముంబై వర్సెస్‌ రాజస్తాన్‌ స్కోర్లు:
►టాస్‌- రాజస్తాన్‌- బ్యాటింగ్‌
►రాజస్తాన్‌- 212/7 (20)
►ముంబై- 214/4 (19.3)
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: యశస్వి జైశ్వాల్‌(రాజస్తాన్‌)- 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 124 పరుగులు.

చదవండి: చాలా సంతోషంగా ఉంది.. అతడు భయపెట్టాడు..! భారత క్రికెట్‌కు చాలా మంచిది
వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. అతడొక అద్భుతం: సంజూ శాంసన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement