IPL 2023, CSK Vs LSG Highlights: Chennai Super Kings Beat Lucknow Super Giants By 12 Runs - Sakshi
Sakshi News home page

IPL 2023: చెన్నై చెలరేగగా...

Published Tue, Apr 4 2023 3:16 AM | Last Updated on Tue, Apr 4 2023 9:05 AM

IPL 2023: Chennai Super Kings beats Lucknow by 12 runs - Sakshi

సూపర్‌ కింగ్స్‌ సొంత మైదానంలో సత్తా చాటింది...ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగి భారీ స్కోరు నమోదు చేసిన ధోని టీమ్, ఆపై ప్రత్యర్థిని నిలువరించడంలో సఫలమైంది. రుతురాజ్, కాన్వేలు చెన్నైకి భారీ స్కోరును అందిస్తే, బౌలింగ్‌లో మొయిన్‌ అలీ ఆఫ్‌ స్పిన్‌ జట్టును గెలుపు దిశగా నడిపించింది. మరో వైపు తమ తొలి మ్యాచ్‌ను గెలుపు జోరు మీదున్న లక్నో ప్రభావం చూపలేకపోయింది. ఓపెనర్‌ మేయర్స్‌ ఆట మినహా మిగతా రంగాల్లో విఫలం కావడంతో రాహుల్‌ బృందానికి ఓటమి తప్పలేదు.  

చెన్నై: నాలుగేళ్ల తర్వాత ప్రత్యక్షంగా మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమితానందాన్ని పంచింది. గత ఓటమిని మరిచేలా చేస్తూ లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన పోరులో చెన్నై 12 పరుగుల తేడాతో లక్నోను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.

రుతురాజ్‌ గైక్వాడ్‌ (31 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) వరుసగా రెండో మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించగా, డెవాన్‌ కాన్వే (29 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. రవి బిష్ణోయ్, మార్క్‌వుడ్‌ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్నో సూపర్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌ (22 బంతుల్లో 53; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొయిన్‌ అలీ (4/26) ప్రత్యర్థిని దెబ్బతీశాడు.  

శతక భాగస్వామ్యం...
కేవలం 56 బంతుల్లో 110 పరుగులు...చెన్నై తొలి వికెట్‌ భాగస్వామ్యమిది. రుతురాజ్, కాన్వే చెలరేగుతూ లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. అవేశ్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో కాన్వే మొదలుపెట్టగా, గౌతమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో రుతురాజ్‌ మూడు సిక్సర్లతో చెలరేగాడు. వుడ్‌ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్‌తో 19 పరుగులు రాబట్టిన చెన్నై పవర్‌ప్లే ముగిసే సరికి 79 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 25 బంతుల్లోనే రుతురాజ్‌ అర్ధసెంచరీ పూర్తయింది.

కృనాల్‌ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి కాన్వే తన జోరును కొనసాగించాడు. ఎట్టకేలకు బిష్ణోయ్‌ తన తొలి బంతికే వికెట్‌ తీసి రుతురాజ్‌ను వెనక్కి పంపడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే కాన్వే అవుట్‌ కాగా...మూడో స్థానంలో వచ్చిన శివమ్‌ దూబే (16 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒక దశలో తాను ఎదుర్కొన్న వరుస నాలుగు బంతుల్లో అతను 6, 4, 6, 6తో చెలరేగిపోయాడు.

అతని వికెట్‌ కూడా బిష్ణోయ్‌ ఖాతాలోకే చేరగా, అవేశ్‌ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన మొయిన్‌ అలీ (19)ని కూడా బిష్ణోయ్‌ అవుట్‌ చేశాడు. స్టోక్స్‌ (8), జడేజా (3) విఫలం కాగా...చివర్లో అంబటి రాయుడు (14 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధోని (12) కలిసి స్కోరును 200 పరుగులు దాటించారు. లక్నో ప్రధాన బౌలర్‌ మార్క్‌ వుడ్‌ తన చివరి రెండు ఓవర్లలో 4 సిక్సర్లతో సహా మొత్తం 30 పరుగులు సమర్పించుకున్నాడు.  

మేయర్స్‌ మినహా...
భారీ ఛేదనలో జట్టుకు అవసరమైన శుభారంభం లక్నోకు లభించింది. 35 బంతుల్లోనే ఓపెనర్లు 79 పరుగులు జోడించారు. ఇందులో మేయర్స్‌ మెరుపులే ఎక్కువగా ఉండగా, కేఎల్‌ రాహుల్‌ (20) ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాడు. స్టోక్స్‌ ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన మేయర్స్‌ చహర్‌ వరుస రెండు ఓవర్లలో కలిపి మొత్తం 5 ఫోర్లు బాదాడు. తుషార్‌ ఓవర్లోనూ 4, 6 కొట్టిన అతను 21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే అలీ తన తొలి ఓవర్లోనే మేయర్స్‌ను అవుట్‌ చేసి లక్నో పతనానికి శ్రీకారం చుట్టాడు.

ఆ తర్వాత ఏ దశలోనూ జెయింట్స్‌ కోలులోకపోయింది. హుడా (2), కృనాల్‌ (9) విఫలం కాగా, స్టొయినిస్‌ (21) కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేయలేదు. క్రీజ్‌లో ఉన్నంత సేపు నికోలస్‌ పూరన్‌ (18 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా జట్టు విజయానికి అది సరిపోలేదు. రాజ్‌వర్ధన్‌ ఓవర్లోనే వరుసగా 6, 4, 4 కొట్టిన పూరన్‌ జడేజా ఓవర్లో రెండు సిక్స్‌లు బాదాడు. 16వ ఓవర్‌ చివరి బంతికి పూరన్‌ అవుట్‌ కావడంలో లక్నో విజయావకాశాలు పూర్తిగా కోల్పోయింది.  

స్కోరు వివరాలు:  
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) వుడ్‌ (బి) బిష్ణోయ్‌ 57; కాన్వే (సి) కృనాల్‌ (బి) వుడ్‌ 47; దూబే (సి) వుడ్‌ (బి) బిష్ణోయ్‌ 27; అలీ (స్టంప్డ్‌) పూరన్‌ (బి) బిష్ణోయ్‌ 19; స్టోక్స్‌ (సి) యష్‌ (బి) అవేశ్‌ 8; రాయుడు (నాటౌట్‌) 27; జడేజా (సి) బిష్ణోయ్‌ (బి) వుడ్‌ 3; ధోని (సి) బిష్ణోయ్‌ (బి) వుడ్‌ 12; సాన్‌ట్నర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 217.
వికెట్ల పతనం: 1–110, 2–118, 3–150, 4–166, 5–178, 6–203, 7–215. 
బౌలింగ్‌: మేయర్స్‌ 2–0–16–0, అవేశ్‌ 3–0–39–1, కృనాల్‌ 2–0–21–0, గౌతమ్‌ 1–0–20–0, వుడ్‌ 4–0–49–3, యష్‌ ఠాకూర్‌ 4–0–36–0, రవి బిష్ణోయ్‌ 4–0–28–3.  

లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) రుతురాజ్‌ (బి) అలీ 20; మేయర్స్‌ (సి) కాన్వే (బి) అలీ 53; హుడా (సి) స్టోక్స్‌ (బి) సాన్‌ట్నర్‌ 2; కృనాల్‌ (సి) జడేజా (బి) అలీ 9; స్టొయినిస్‌ (బి) అలీ 21; పూరన్‌ (సి) స్టోక్స్‌ (బి) తుషార్‌ 32; బదోని (సి) ధోని (బి) తుషార్‌ 23; గౌతమ్‌ (నాటౌట్‌) 17; వుడ్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 205.  వికెట్ల పతనం: 1–79, 2–82, 3–82, 4–105, 5–130, 6–156, 7–195. 
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–55–0, స్టోక్స్‌ 1–0–18–0, తుషార్‌ 4–0–45–2, మొయిన్‌ అలీ 4–0–26–4, సాన్‌ట్నర్‌ 4–0–21–1, రాజ్‌వర్ధన్‌ 2–0–24–0, జడేజా 1–0–14–0.  

ధోని ఫటాఫట్‌...
మ్యాచ్‌ను తన భుజస్కంధాలపై మోసే భారంనుంచి చాలా కాలంగా దూరమైన ధోని కొద్ది సేపు క్రీజ్‌లో ఉండి అభిమానులను అలరిస్తే చాలు అన్నట్లుగా ఆడుతున్నాడు. అతని ఆట చూసేందుకు చెపాక్‌ మైదానానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్‌ను అతను నిరాశపర్చలేదు. 6, 6, అవుట్‌...ఆడిన మూడు బంతుల్లోనే రెండు సిక్సర్లతో స్టేడియం హోరెత్తగా, సొంత జట్టు సభ్యులు కూడా ఆ సిక్సర్లకు సంబరాలు చేసుకున్నారు. తొలి మ్యాచ్‌లోనూ 7 బంతుల్లో ఫోర్, సిక్స్‌ బాదిన అతను 14 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో ధోని ఐపీఎల్‌లో 5 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. లీగ్‌లో ఈ మైలురాయిని దాటిన ఏడో ఆటగాడిగా (కోహ్లి, ధావన్, వార్నర్, రోహిత్, రైనా, డివిలియర్స్‌ తర్వాత) నిలిచాడు.

ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ X గుజరాత్‌ (రాత్రి గం. 7:30 నుంచి )
స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement