ఐపీఎల్లో ఆర్‌సీబీ(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ప్రతీసారి ఫెవరెట్‌గానే కనిపిస్తోంది. కారణం విరాట్ కోహ్లి. అతని బ్రాండ్ జట్టును ఎప్పుడు స్టార్ హోదాలో ఉంచుతుంది. గతేడాది ఐపీఎల్‌లో ఆర్‌సీబీ మంచి ప్రదర్శన కనబరిచినప్పటికి టైటిల్ మాత్రం కొట్టలేకపోయింది. మరో సౌతాఫ్రికా జట్టులా తయారైన ఆర్‌సీబీకి దురదృష్టం చాలా ఎక్కువ. గత సీజన్‌లో ప్లేఆఫ్ చేరినప్పటికి క్వాలిఫయర్-2లో ఓడి ఇంటిబాట పట్టింది. 15 సీజన్లుగా బరిలో ఉన్నప్పటికి టైటిల్ మాత్రం అందని ద్రాక్షలానే మిగిలిపోయింది.
గత సీజన్ లో కోహ్లి పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు అతనున్న ఫామ్ దృశ్యా జట్టుకు తొలి ఐపీఎల్ ట్రోఫీ అందిస్తాడని ఆర్సీబీ ఆశతో ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్‌సీబీ జట్టు ఆటగాళ్లకు ఫోటోషూట్ నిర్వహించింది. వీటన్నింటిని తమ బోల్డ్ డైరీస్‌లో షేర్ చేసింది. కాగా కోహ్లి బోల్డ్ డైరీస్‌లో మాట్లాడుతూ చాలా విషయాలు పేర్కొన్నాడు. కార్లను అమ్మేయడం నుంచి తన ఫెవరెట్ క్రికెటర్లు ఎవరనేది ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.
"నేను వాడిన చాలా కార్లు ముందు చూపు లేకుండా కొన్నవే. కానీ వాటిని నేను పెద్దగా నడిపింది లేదు. కానీ ఓ సమయం వచ్చిన తర్వాత అనవసరంగా కొన్నాను అనిపించి వాటిలో చాలా వాటిని అమ్మేశాను. ఇప్పుడు మాకు కచ్చితంగా అవసరం అనిపించేవే వాడుతున్నాను. ఏవి అవసరం ఏవి కాదు అని తెలుసుకునే పరిణతి వచ్చిన తర్వాత అనవసరమైన కార్లను అమ్మేశాను" అని కోహ్లి చెప్పడం విశేషం.
ఇక తన ఆరాధ్య క్రికెటర్లు వివ్ రిచర్డ్స్, సచిన టెండూల్కర్ అని, వాళ్లు క్రికెట్ నే మార్చిన ప్లేయర్స్ అని కొనియాడాడు. 2016 ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఏకంగా నాలుగు సెంచరీలతోపాటు 973 రన్స్ చేసిన విరాట్.. ఇప్పటికీ ఆ టీమ్ లో కీలకమైన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్ ద్వారా ఆర్‌సీబీ ఈ సీజన్‌ను ఆరంభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment