IPL 2023: Lucknow Beat Sunrisers By 7 Wickets - Sakshi
Sakshi News home page

IPL 2023: పూరన్‌ ఊచకోత.. లక్నో గ్రాండ్‌ విక్టరీ.. సన్‌రైజర్స్‌ ఔట్‌

May 13 2023 7:46 PM | Updated on May 13 2023 8:00 PM

IPL 2023: Lucknow Beat Sunrisers By 7 Wickets - Sakshi

PC: IPL Twitter

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ కథ ముగిసింది. లక్నోతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఓడటం ద్వారా సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు గల్లంతయ్యాయి. సన్‌రైజర్స్‌ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో నాలుగు బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 16 ఓవర్ల వరకు తమ వైపు ఉన్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ బౌలర్‌ అభిషేక్‌ శర్మ పువ్వుల్లో పెట్టి ప్రత్యర్ధికి అప్పజెప్పాడు.

ఆ ఓవర్‌లో అభిషేక్‌ 31 పరుగులు (స్టోయినిస్‌ 2 సిక్సర్లు, పూరన్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లు) సమర్పించుకోవడంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయి, లక్నో వైపు మలుపు తిరిగింది. పూరన్‌ (13 బంతుల్లో 44 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో పాటు ప్రేరక్‌ మన్కడ్‌ (45 బంతుల్లో 64 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లలో వరుసగా 14, 10, 10, 6 పరుగులు రాబట్టి లక్నోను విజయతీరాలకు చేర్చారు. లక్నో గెలుపులో స్టోయినిస్‌ (25 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్‌ (19 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్‌) తమ వంతు పాత్ర పోషించారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌, మయాంక్‌ మార్కండే, అభిషేక్‌ శర్మ తలో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (36), రాహుల్‌ త్రిపాఠి (20), మార్క్రమ్‌ (28), క్లాసెన్‌ (47), అబ్దుల్‌ సమత్‌ (37 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (0), అభిషేక్‌ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్‌ 2, యుద్ద్‌వీర్‌ సింగ్‌, యశ్‌ ఠాకూర్‌, అమిత్‌ మిశ్రా, ఆవేశ్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

కాగా, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఆ జట్టు తదుపరి ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేని పరిస్థితి. మరోవైపు ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించడంతో లక్నో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. గుజరాత్‌ (16), సీఎస్‌కే (15), ముంబై (14) పాయింట్ల పట్టికలో టాప్‌ త్రీలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement