![IPL 2023: Shubman Gill Is The Second Player After Dhoni To Play Three Consecutive IPL Finals - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/27/Untitled-9.jpg.webp?itok=I8jFAHJF)
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత అరుదైన ఘనత సాధించనున్నాడు. రేపు జరుగబోయే ఐపీఎల్-2023 ఫైనల్లో ఆడటం ద్వారా గిల్ ఈ రికార్డును సొంతం చేసుకోనున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. ఐపీఎల్‌లో ఇప్పటివరకు సీఎస్‌కే సారధి ఎంఎస్ ధోని మినహా ఎవ్వరూ వరుసగా మూడు ఫైనల్స్‌లో ఆడింది లేదు. 2016, 2017, 2018 సీజన్లలో ప్రస్తుత ఆర్సీబీ సభ్యుడు కర్ణ్ శర్మ వరుసగా మూడు ఫైనల్స్‌లో ఆడినప్పటికీ, అతను మూడుకు మూడు సార్లు తుది జట్లలో లేడు.
కేవలం ఒక్క ధోని మాత్రమే మూడు కాదు ఏకంగా నాలుగు ఫైనల్స్ (2010 (విన్నర్), 2011 (విన్నర్), 2012, 2013 (రన్నరప్) ఆడాడు. సీఎస్‌కేతో రేపు జరుగబోయే ఫైనల్లో బరిలోకి దిగడం ద్వారా శుభ్‌మన్ గిల్ కూడా ధోని తరహాలోనే హ్యాట్రిక్ ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. గిల్ 2021లో కేకేఆర్ (రన్నరప్) తరఫున, 2022లో గుజరాత్ (విన్నర్) తరఫున, రేపు జరుగబోయే ఫైనల్స్‌లో మరోసారి గుజరాత్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
ఐపీఎల్ ఫైనల్స్‌లో గిల్ ట్రాక్ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. 2021 ఫైనల్లో హాఫ్ సెంచరీ (51) చేసిన గిల్.. గత సీజన్‌లో అజేయమైన ఇన్నింగ్స్ (45) ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రస్తుతం గిల్ ఉన్నభీకర ఫామ్‌ను చూస్తే, ఈ సీజన్‌లో అతను మరో శతకం (4వది) బాదిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ ఇదే జరిగిన విరాట్ కోహ్లి రికార్డు (సీజన్‌లో అత్యధిక పరుగులు) కూడా బద్దలయ్యే అవకాశం ఉంది.
రేపటి మ్యాచ్‌లో గిల్ మరో 123 పరుగులు చేస్తే.. 2016లో కోహ్లి చేసిన 973 పరుగుల రికార్డు కనుమరుగవుతుంది. అలాగే గిల్ రేపటి మ్యాచ్‌లో సెంచరీ చేస్తే, ఓ సీజన్‌లో అత్యధిక సెంచరీల రికార్డు (కోహ్లి-4, జోస్ బట్లర్-4) కూడా సమం అవుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడిన గిల్ 60.79 సగటున, 156.43 స్ట్రయిక్ రేట్‌తో 3 శతకాలు, 4 అర్ధశతకాల సాయంతో 851 పరుగులు చేశాడు.
చదవండి: శుభ్‌మన్ గిల్‌కు ఆరెంజ్ క్యాప్.. అయితే గుజరాత్ టైటిల్ గెలవడం కష్టం..!
Comments
Please login to add a commentAdd a comment