ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (మే 18) జరుగబోయే కీలక సమరంలో సన్‌రైజర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సన్‌రైజర్స్‌కు ఒరిగేదేమీ లేనప్పటికీ, ఆర్సీబీకి మాత్రం అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారతాయి. ఆర్సీబీకి మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉన్నా, అది టేబుల్ టాపర్ గుజరాత్‌తో (మే 21న) కావడం, అదీ భారీ తేడాతో గెలవాల్సి ఉండటం ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారుతుంది.
ఇక, నేటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఓడుతుందో అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఆర్సీబీపై సన్‌రైజర్స్ గెలుపోటముల రికార్డు ఘనంగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు జరగ్గా.. సన్‌రైజర్స్ 12, ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ రద్దైంది. గతం సన్‌రైజర్స్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుస్తుందా..లేదా..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం సన్‌రైజర్స్‌తో పోలిస్తే ఆర్సీబీకే విజయావకాశాలు అధికంగా ఉన్నప్పటికీ.. ఆ జట్టు పూర్తిగా KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్)పైనే అధారపడి ఉండటం వారి ఫ్యాన్స్‌ను కలవరపెడుతుంది.
మరోవైపు సన్‌రైజర్స్ పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. ఆటగాళ్ల నిలకడలేమి ఆ జట్టు ఓటములకు ప్రధాన కారణంగా మారింది. ఏ ఆటగాడు ఎప్పుడు ఎలా ఆడతాడో వారితో పాటు ఎవరికీ తెలియని పరిస్థితి. KGFతో పాటు సిరాజ్, హాజిల్‌వుడ్, కర్ణ్ శర్మ తమ ఫామ్‌ను కొనసాగిస్తే, నేటి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవడం పెద్ద సమస్య ఏమీ కాకపోవచ్చు. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ సైతం నేటి మ్యాచ్‌లో ఆర్సీబీనే గెలవాలనుకోవడం విశేషం. తమ జట్టు ఎలాగూ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది కాబట్టి, వారు ఆర్సీబీ గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలని కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లి ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న సానుభూతి అభిమానుల్లో ఉంది. దీంతో ఈ యేడు సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కూడా ఆర్సీబీ మద్దతుదారులుగా మారిపోయారు. ఏది ఎలా ఉన్నా, నేటి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌తో ఆర్సీబీ మ్యాచ్.. గెలిచిందా నిలుస్తుంది..!
Comments
Please login to add a commentAdd a comment