హార్దిక్ పాండ్యా (PC: MI/IPL)
‘‘నేను ఒక్క విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను.. అనవసర విషయాలను అస్సలు పట్టించుకోవద్దు. నీ మనసులో చెలరేగే అలజడి గురించి బయటివాళ్లకు ఎలా తెలుస్తుంది? వాళ్లు వచ్చి మన ఆవేదనను తీర్చలేరు కదా!
వ్యక్తిగతంగా నన్నైతే ఇలాంటి విషయాలు అస్సలు ప్రభావితం చేయలేవు. ఎందుకంటే నేను వాటిని పట్టించుకోను. అసలు నా గురించి మాట్లాడేవారి వైపు చూడను కూడా చూడను. బయట చాలా మంది చాలా రకాలుగా వాగుతుంటారు. అవి చెవికి ఎక్కించుకుంటే.. మన భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి.
బహుశా.. హార్దిక్ విషయంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు అతడు ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. కాబట్టి సహజంగానే అతడికి ఇదంతా కొత్తగా ఉంటుంది.
టీమిండియా స్టార్ ప్లేయర్ అయి ఉండి ఇండియాలోనే ఇలా అభిమానులచే అవమానం ఎదుర్కోవడం హార్దిక్‌ను కచ్చితంగా ఉక్కిరిబిక్కిరి చేసి ఉంటుంది. గతంలో అతడికి ఇలాంటి అనుభవం లేదు కాబట్టి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది’’ అని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు.
కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మపై వేటు వేసి పాండ్యాకు ముంబై పగ్గాలు అప్పగించారు. అయితే, రోహిత్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
అదే విధంగా.. మైదానంలో రోహిత్‌తో హార్దిక్ పాండ్యా ప్రవర్తనను కూడా సహించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ పాండ్యాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
పాండ్యా కనిపిస్తే చాలు రోహిత్ నామస్మరణ చేయడంతో పాటు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ అభ్యంతరకర భాషతో హార్దిక్‌ను ట్రోల్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే.. ఇప్పటి వరకు అతడి సారథ్యంలో ముంబై ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోవడంతో కామెంట్లు మరింత శ్రుతిమించాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ కామెంటేటర్ స్టీవ్ స్మిత్ స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగా అవమానించేవారిని పట్టించుకోకుండా.. ముందుకు సాగడమే ఉత్తమమని హార్దిక్ పాండ్యాకు సలహా ఇచ్చాడు. ఈ మేరకు ఈఎస్‌ఎపీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశాడు. కాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న స్మిత్ కెప్టెన్సీ కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో నిషేధం ఎదుర్కొని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అతడిని చీటర్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ గేలి చేశారు. ఆ సమయంలో తాను అవేమీ పట్టించుకోకుండా కేవలం ఆటపై దృష్టి పెట్టి ముందుకు సాగిన విషయాన్ని స్మిత్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment