IPL 2024: నేను ఆరాధించే బౌలర్‌ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్‌గన్‌’ | IPL 2024: I Idolise Only One Fast Bowler Reveals Speed Demon Mayank Yadav - Sakshi
Sakshi News home page

Mayank Yadav Cricketing Idol: నేను ఆరాధించే ఫాస్ట్‌ బౌలర్‌ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్‌గన్‌’

Published Sun, Mar 31 2024 8:54 AM | Last Updated on Sun, Mar 31 2024 1:42 PM

IPL 2024 I Idolise Only One Fast Bowler That Is: Speed demon Mayank Yadav - Sakshi

మయాంక్‌ యాదవ్‌ (PC: LSG X)

IPL 2024- LSG Speed demon Mayank Yadav reveals His Idol Name: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మయాంక్‌ యాదవ్‌. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఐపీఎల్‌-2024 బరిలో దిగిన అతడు.. అరంగేట్రంలోనే తన ‘స్పీడ్‌’ పవరేంటో చూపించాడు.

పంజాబ్‌ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో 150 కి.మీ. పైగా వేగంతో బంతులు విసిరి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌లో తొలి ఫాస్టెస్ట్‌ డెలివరీని నమోదు చేసి తన పేరును రికార్డుల్లో పదిలపరుచుకున్నాడు మయాంక్‌ యాదవ్‌.

మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అనంతరం మయాంక్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఫాస్ట్‌ బౌలింగ్‌ పట్ల తనకున్న ఇష్టం గురించి చెప్పుకొచ్చాడు.

స్పీడ్‌ థ్రిల్స్‌
‘‘వేగం.. నన్ను ఉత్కంఠకు గురి చేస్తుంది. అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తుంది. కేవలం బౌలింగ్‌లోనే కాదు.. సాధారణ జీవితంలోనూ అంతే! రాకెట్లు, విమానాలు, సూపర్‌ బైకులు.. వీటిని చూస్తుంటే నాకెంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

చిన్నతనంలో నేను వేగంగా ప్రయాణించే విమానాలను ఇష్టపడేవాడిని. అక్కడి నుంచే ఈ ఇష్టం మొదలైంది. నా బౌలింగ్‌లో వేగానికి స్ఫూర్తి అవే!’’ అని మయాంక్‌ యాదవ్‌ పేర్కొన్నాడు.

నేను ఆరాధించే ఏకైక ఫాస్ట్‌ బౌలర్‌ అతడే
ఇక తన ఐడల్‌ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఈ ప్రపంచంలో తాను ఆరాధించే ఒకే ఒక్క ఫాస్ట్‌ బౌలర్‌ సౌతాఫ్రికా స్పీడ్‌గన్‌ డేల్‌ స్టెయిన్‌ అని మయాంక్‌ యాదవ్‌ స్పష్టం చేశాడు. ఇక ఫాస్ట్‌ బౌలర్ల జీవితాల్లో గాయాలు భాగమని.. అందుకే కెరీర్‌ ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఊహించలేమన్నాడు. గత సీజన్‌లో గాయం వల్లే తాను ఐపీఎల్‌కు దూరమైన విషయాన్ని ఈ సందర్భంగా మయాంక్‌ యాదవ్‌ గుర్తు చేసుకున్నాడు.

లక్నో నమ్మకాన్ని నిలబెడుతూ
కాగా ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల మయాంక్‌ యాదవ్‌.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌ 2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ. 20 లక్షల కనీస ధరకు అతడిని కొనుక్కుంది. అయితే, గాయం కారణంగా  2023 సీజన్‌లో ఆడలేకపోయాడు. అనంతరం.. ఐపీఎల్‌-2024కు ముందు మినీ వేలంలో భాగంగా లక్నో మరోసారి అతడిని సొంతం చేసుకుంది. 

ఈ నేపథ్యంలో.. ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శనివారం నాటి పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెలరేగి జట్టును గెలిపించాడు మయాంక్‌ యాదవ్‌. కాగా సొంతమైదానంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో బోణీ కొట్టింది.

చదవండి: IPL 2024: కోహ్లి, గంభీర్‌కు ఆస్కార్‌ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement