చరిత్రపుటల్లోకెక్కిన సన్‌రైజర్స్‌-ఆర్సీబీ మ్యాచ్‌.. టీ20 రికార్డులు బద్దలు | IPL 2024: Most Boundaries And Sixes Recorded In SRH vs RCB Match | Sakshi
Sakshi News home page

IPL 2024: చరిత్రపుటల్లోకెక్కిన సన్‌రైజర్స్‌-ఆర్సీబీ మ్యాచ్‌.. చాలా వరకు టీ20 రికార్డులు బద్దలు

Published Tue, Apr 16 2024 9:07 AM | Last Updated on Tue, Apr 16 2024 1:18 PM

IPL 2024: Most Boundaries And Sixes Recorded In SRH VS RCB Match - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఆర్సీబీ-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్‌ 15) జరిగిన మ్యాచ్‌ చాలా వరకు టీ20 రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చేసిన స్కోర్‌ (287/3) 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధికం కాగా.. పొట్టి క్రికెట్‌ చరిత్రలో రెండో అత్యధిక టీమ్‌ స్కోర్‌గా (గతేడాది ఏషియన్‌ గేమ్స్‌లో నేపాల్‌ మంగోలియాపై చేసిన 314 పరుగుల స్కోర్‌ టీ20ల్లో అత్యధికం) రికార్డైంది. 

  • ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన స్కోర్‌ (సన్‌రైజర్స్‌ 287 + ఆర్సీబీ 262=549) టీ20 హిస్టరీలో (ఓ మ్యాచ్‌లో) నమోదైన అత్యధిక స్కోర్‌గా నిలిచింది. 
  • ఈ మ్యాచ్‌లో 22 సిక్సర్లు కొట్టిన సన్‌రైజర్స్‌.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (ఓ ఇన్నింగ్స్‌లో) కొట్టిన జట్టుగా ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పింది. 
  • ఈ మ్యాచ్‌లో ట్రవిస్‌ హెడ్‌ (39 బంతులు) చేసిన సెంచరీ సన్‌రైజర్స్‌ తరఫున వేగవంతమైన శతకంగా రికార్డుల్లోకెక్కింది. 
  • ఈ మ్యాచ్‌లో నమోదైన బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు= 81), సిక్సర్లు (38) (ఇరు జట్లు కలిపి కొట్టినవి) పొట్టి క్రికెట్‌ చరిత్రలోనే ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక బౌండరీలు, సిక్సర్లుగా రికార్డయ్యాయి. 

ఈ రికార్డులే కాక ఈ మ్యాచ్‌లో మరెన్నో చిన్నా చితక రికార్డులు నమోదయ్యాయి. మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. ట్రవిస్‌ హెడ్‌ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్‌ సమద్‌ (10 బంతుల్లో 37 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్‌ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్‌ (10 బంతుల్లో 37 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో ఫెర్గూసన్‌ 2, టాప్లే ఓ వికెట్‌ పడగొట్టాడు. 

కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పోరాడితే పోయేదేమీ లేదనుకుని చివరి నిమషం వరకు గెలుపు కోసం ప్రయత్నించింది. విరాట్‌ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్‌ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్‌ కార్తీక్‌ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్‌ లోమ్రార్‌ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్‌ రావత్‌ (14 బంతుల్లో 25 నాటౌట్‌; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో కమిన్స్‌ 3, మయాంక్‌ మార్కండే 2, నటరాజన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement