రోహిత్ శర్మతో హార్దిక్ పాండ్యా (PC: BCCI/MI)
ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడుతూ రోహిత్ శర్మ గురించి ప్రస్తావించాడు. ఎన్నో ఏళ్లుగా తాను రోహిత్ కెప్టెన్సీలో ఆడానని.. ఈసారి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండబోతుందని వ్యాఖ్యానించాడు.
ఏదేమైనా తనకు అవసరమైన సమయంలో రోహిత్ శర్మ కచ్చితంగా అండగా నిలబడతాడని హార్దిక్ పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించి.. ఐదుసార్లు జట్టును చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మపై వేటు వేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా.. భవిష్యత్తు కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంఛైజీ పేర్కొంది.
ఈ క్రమంలో తాజాగా కెప్టెన్ హోదాలో హార్దిక్ పాండ్యా ప్రెస్‌మీట్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా.. ‘‘అసలు ఈ విషయం గురించి పెద్దగా చర్చ అవసరమే లేదు. తను(రోహిత్ శర్మ) జట్టుతోనే ఉంటాడు. నాకు అవసరమైనపుడు కచ్చితంగా సాయం చేస్తాడు.
అతడు టీమిండియా కెప్టెన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. తన కెప్టెన్సీలో ఎన్నో విజయాలు సాధించాడు. ఇప్పటి నుంచి నేను అతడి వారసత్వాన్ని ముందు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తాను.
నా సారథ్యంలో అతడు ఆడుతున్నాడనే అంశం గురించి ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. ఇదొక మంచి అనుభవంగా మిగిలిపోతుంది. నా కెరీర్‌లో చాలా వరకు అతడి కెప్టెన్సీలోనే ఆడాను. ఇప్పుడు.. ఈ సీజన్ మొత్తం అతడు నాకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తాడని తెలుసు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
ఇక ఎంఐ కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత రోహిత్ శర్మతో మాట్లాడారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘లేదు. తను టీమిండియా షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడు. తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తోంది.
మేము ఒకరినొకరం కలిసి దాదాపు రెండు నెలలై పోయింది. ఐపీఎల్ మొదలైన వెంటనే కచ్చితంగా తనతో మాట్లాడతా’’ అని పాండ్యా బదులిచ్చాడు. కాగా మార్చి 22న ఐపీఎల్ తాజా ఎడిషన్ మొదలుకానుండగా.. మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
🗣️ "Rohit will have his hand on my shoulder throughout the season." - Hardik Pandya 🥹💙#OneFamily #MumbaiIndians pic.twitter.com/P0U9HvWWeI
— Mumbai Indians (@mipaltan) March 18, 2024
Comments
Please login to add a commentAdd a comment