ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా.. ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకి ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాగించారు. 184 పరుగుల లక్ష్య ఛేదనలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని పంజాబ్‌ను అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో తిరిగి లైన్‌లో నిలబెట్టారు.
అయితే ఆఖర్లో ముంబై బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఇలా చేజారిందనున్న మ్యాచ్‌లలో తిరిగి తమ జట్టును రేస్‌లో నిలబెట్టడంతో శశాంక్, అశుతోష్ జోడీకి ఇది కొత్తేమీ కాదు. ఈ సీజన్‌లోనే ఈ జోడీ ఇలా చేయడం ఇది మూడోసారి. ఓ సందర్భంగా తమ జట్టును విజయతీరాలకు చేర్చిన ఈ జోడీ.. రెండు మ్యాచ్‌ల్లో గెలుపు అంచుల దాకా తీసుకెళ్లగలిగింది. ఈ సీజన్‌లో పంజాబ్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో చివరి ఓవర్‌లో ఓటములను ఎదుర్కొవడం ఇది నాలుగో సారి (ఆర్సీబీ, సన్‌రైజర్స్, రాజస్థాన్, ముంబై).
ఈ సీజన్‌లో శశాంక్-అశుతోష్ జోడీ దాదాపు ప్రతి మ్యాచ్‌లో అద్బుతమైన పోరాటపటిమ కనబరుస్తున్నప్పటికీ మిగతా సభ్యుల తోడ్పాటు లభించకపోవడంతో పంజాబ్ వరుస ఓటములు ఎదుర్కొంటుంది. జట్టులో పెద్ద స్టార్లు లేకపోయినా ఈ సీజన్‌లో శశాంక్, అశుతోషే వారి పాలిట స్టార్లయిపోయారు. విచిత్రమేమిటంటే శశాంక్‌ను పంజాబ్ వేలంలో పొరపాటున తీసుకుంది. ఇంకో శశాంక్ అని ఈ శశాంక్‌ను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ సహా యజయాని ప్రీతి జింటా అప్పట్లో తెగ బాధ పడిపోయింది. ఇప్పుడు వద్దనుకున్న ఆ శశాంకే పంజాబ్‌ను కనీసం రేస్‌లో అయిన నిలబెట్టగలుగుతున్నాడు.
ఈ సీజన్ మొత్తంలో శశాంక్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూ తన జట్టును గెలుపు రేస్‌లో నిలబెడుతున్నాడు. ఇతనికి ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ తోడవుతున్నాడు. అశుతోష్ ఇంపాక్ట్ ప్లేయర్ అన్న పదానికి సరైన న్యాయం చేస్తున్నాడు. ఎక్కడో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటమే కాకుండా తన జట్టును గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నిస్తున్నాడు.
నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అయితే అశుతోష్ పంజాబ్‌ను గెలిపించినంత పని చేశాడు. అశుతోష్ దెబ్బకు ముంబై బౌలర్లు వణికిపోయారు. గెలుపు ఆశలు సైతం వదులుకున్నారు. ఈ సీజన్ మొత్తంలో శశాంక్, అశుతోష్ పోరాటం చాలా స్పూర్తిదాయకం. వీరిద్దరు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రత్యర్దులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
ఈ సీజన్‌లో శశాంక్, అశుతోష్ చేసిన స్కోర్లు..
- ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్: 193 పరుగుల లక్ష్య ఛేదన- శశాంక్ (41), అశుతోష్ (61)- 9 పరుగుల తేడాతో చివరి ఓవర్లో పంజాబ్ ఓటమి
- రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్: తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్- శశాంక్ (9), అశుతోష్ (16 బంతుల్లో 31; ఫోర్, 3 సిక్సర్లు)- చివరి ఓవర్‌లో 3 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి
- సన్‌రైజర్స్‌తో మ్యాచ్: 183 పరుగుల లక్ష్య ఛేదన- శశాంక్ (25 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), అశుతోష్ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)- 2 పరుగుల తేడాతో చివరి ఓవర్లో పంజాబ్ ఓటమి.
- గుజరాత్‌తో మ్యాచ్: 200 పరుగుల లక్ష్య ఛేదన-శశాంక్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్)- మరో బంతి మిగిలుండగా పంజాబ్ గెలుపు
- లక్నోతో మ్యాచ్: 200 పరుగుల లక్ష్య ఛేదన- శశాంక్ (7 బంతుల్లో 9 నాటౌట్; ఫోర్)- 21 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి
- ఆర్సీబీతో మ్యాచ్: తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్- శశాంక్ (8 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు)-4 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి
- ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్: 175 పరుగుల లక్ష్య ఛేదన- తొలి బంతికే ఔటైన శశాంక్ - అయినా 4 వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపు
Comments
Please login to add a commentAdd a comment