9 పరుగులతో పంజాబ్‌పై గెలుపు
చెలరేగిన సూర్య, బుమ్రా, కొయెట్జీ
అశుతోష్ మెరుపులు వృథా
ముల్లాన్‌పూర్: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన పెద్ద లక్ష్యం ముందు పంజాబ్ కింగ్స్ 14/4 స్కోరుతో ఆరంభంలోనే మోకరిల్లింది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మల మెరుపులు కింగ్స్‌ను గెలుపు ట్రాక్‌లో పడేశాయి. కానీ వికెట్లు అందుబాటులో లేక 6 బంతుల్లో సులువైన 12 పరుగుల్ని చేయలేక చివరకు పంజాబ్ ఆలౌటైంది.
దీంతో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై 9 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ (53 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు.
హర్షల్ పటేల్ 3, స్యామ్ కరన్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), శశాంక్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆశలు రేపారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్‌ప్రీత్ బుమ్రా, కొయెట్జీ చెరో 3 వికెట్లు తీశారు.
సూర్య ప్రతాపం...
ఆరంభంలోనే ఇషాన్ (8) అవుట్ కాగా... కెరీర్‌లో 250వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ (25 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ పవర్ ప్లేలో జట్టు స్కోరును 54/1కు తీసుకెళ్లారు. తర్వాత సూర్య దూకుడు కొనసాగడంతో పరుగుల వేగం పెరిగింది.
సగం ఓవర్లు ముగిసేసరికి ముంబై 86/1 స్కోరు చేసింది. ఆ మరుసటి ఓవర్లోనే సూర్యకుమార్ 34 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. అయితే 12వ ఓవర్ వేసిన స్యామ్ కరన్... రోహిత్ ఆట ముగించడంతో రెండో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్లో ముంబై వంద పరుగులను చేరుకుంది.
14 ఓవర్లలో 115/2 స్కోరు చేసిన ముంబై... సూర్య, తిలక్ ధాటిగా ఆడటంతో మిగిలిన 6 ఓవర్లలో 77 పరుగుల్ని సాధించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (10) తక్కువే చేసినా... తిలక్ మెరుపులు ముంబై జోరుకు దోహదం చేశాయి. హర్షల్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ (14), షెఫర్డ్ (1), నబీ (0) అవుట్ కావడంతో కేవలం 7 పరుగులే వచ్చాయి.
14/4 అయినా... వణికించిన అశుతోష్!
పంజాబ్ ఇన్నింగ్స్ ఇలా మొదలైందో లేదో... అలా కుదేలైంది. 2.1 ఓవర్లలోనే 14/4 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడింది. అటు కొయెట్జీ, ఇటు బుమ్రా ధాటికి ఓపెనర్లు స్యామ్ కరన్ (6), ప్రభ్‌సిమ్రన్ (0), రోసో (1), లివింగ్‌స్టోన్ (1) పెవిలియన్‌కు దారి కట్టారు. ఈ దశలో శశాంక్, అశుతోష్ సిక్సర్లతో అలరించారు.
కానీ 12.1 ఓవర్లలో 111/7 వద్ద శశాంక్ నిష్క్రమించడంతో పంజాబ్‌కు ఓటమి ఖాయమైంది. ఈ దశలో అశుతోష్, హర్‌ప్రీత్ బ్రార్ (20 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎనిమిదో వికెట్‌కు చకచకా 57 పరుగుల జోడించడంతో ఊహించని ఉత్కంఠ వచ్చేసింది. కానీ 168 పరుగుల వద్ద అశుతోష్ ఎనిమిదో వికెట్‌గా నిష్క్రమించడంతో పంజాబ్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) హర్‌ప్రీత్ (బి) రబడ 8; రోహిత్ (సి) హర్‌ప్రీత్ (బి) స్యామ్ కరన్ 36; సూర్యకుమార్ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) సామ్ కరన్ 78; తిలక్ వర్మ (నాటౌట్) 34; హార్దిక్ పాండ్యా (సి) హర్‌ప్రీత్ (బి) హర్షల్ 10; డేవిడ్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 14; షెఫర్డ్ (సి) శశాంక్ (బి) హర్షల్ 1; నబీ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–18, 2–99, 3–148, 4–167, 5–190, 6–192, 7–192. బౌలింగ్:
లివింగ్‌స్టోన్ 2–0–16–0, అర్‡్షదీప్ 3–0–35–0, రబడ 4–0–42–1, హర్షల్ 4–0–31–3, స్యామ్ కరన్ 4–0–41–2, హర్‌ప్రీత్ బ్రార్ 3–0–21–0.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: స్యామ్ కరన్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 6; ప్రభ్‌సిమ్రన్ (సి) ఇషాన్ (బి) కొయెట్జీ 0; రోసో (బి) బుమ్రా 1; లివింగ్‌స్టోన్ (సి అండ్ బి) కొయెట్జీ 1; హర్‌ప్రీత్ సింగ్ (సి అండ్ బి) గోపాల్ 13; శశాంక్ (సి) తిలక్ వర్మ (బి) బుమ్రా 41; జితేశ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆకాశ్ 9; అశుతోష్ (సి) నబీ (బి) కొయెట్జీ 61; హర్‌ప్రీత్ బ్రార్ (సి) నబీ (బి) పాండ్యా 21; హర్షల్ (నాటౌట్) 1; రబడ (రనౌట్) 8; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 183. వికెట్ల పతనం: 1–10, 2–13, 3–14, 4–14, 5–49, 6–77, 7–111, 8–168, 9–174, 10–183. బౌలింగ్: కొయెట్జీ 4–0–32–3, బుమ్రా 4–0–21–3, ఆకాశ్ మధ్వాల్ 3.1–0–46–1, పాండ్యా 4–0–33–1, శ్రేయస్ గోపాల్ 2–0–26–1, షెఫర్డ్ 2–0–20–0.
ఐపీఎల్‌లో నేడు
లక్నో X చెన్నై
వేదిక: లక్నో
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment