
యజువేంద్ర చహల్ (PC: BCCI/RR)
ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. చంఢీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్- రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరుగనుంది.
ఇక వరుసగా నాలుగు విజయాల తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి రుచి చూసిన రాజస్తాన్.. తిరిగి విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉండగా.. వరుస పరాజయాలతో చతికిలపడ్డ పంజాబ్ సొంత మైదానంలో సత్తా చాటాలని ఉవ్విళూర్లుతోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారనుంది.
ఇక పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గనుక అతడు మూడు వికెట్లు తీస్తే ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
చహల్ ఇప్పటి వరకు 157 ఐపీఎల్ మ్యాచ్‌లలో కలిపి 197 వికెట్లు పడగొట్టాడు. కాగా ముంబై ఇండియన్స్ ద్వారా 2011లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ మణికట్టు స్పిన్నర్.. 2014 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సుదీర్ఘకాలం పాటు ఆడాడు.
అయితే, 2022 మెగా వేలానికి ముందు ఆర్సీబీ చహల్‌ను విడుదల చేయగా.. రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్-2024లో రాజస్తాన్ తరఫున ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన చహల్ 10 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్‌పై యజువేంద్ర చహల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఆ జట్టుతో 19 మ్యాచ్‌లు ఆడిన చహల్ 29 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్-2024 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవాలని చహల్ పట్టుదలగా ఉన్నాడు.
ఇక రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పంజాబ్ కింగ్స్ ఐదింట కేవలం రెండు మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది.
చదవండి: గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్‌లో CSK కెప్టెన్ అతడే!
Saturday Night Goosebumps: Delivered 🔥 pic.twitter.com/cdPMksvqId
— Rajasthan Royals (@rajasthanroyals) April 13, 2024