
Photo Courtesy: BCCI
ఆర్సీబీ నయా కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా తన కెరీర్‌ను గెలుపుతో ప్రారంభించాడు. నిన్న (మార్చి 22) జరిగిన సీజన్ ఓపెనర్‌లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో పాటిదార్ కెప్టెన్‌గా తన ఖాతాను ఓపెన్ చేయడంతో పాటు ఈ సీజన్‌లో ఆర్సీబీకి తొలి విజయాన్నందించాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని మరో 22 బంతులు మిగిలుండగానే ఛేదించే అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి కొత్త జోష్‌తో టైటిల్ వేటను ప్రారంభించింది.
కొత్తగా వచ్చిన ఫిల్ సాల్ట్, కృనాల్ పాండ్యా ఆర్సీబీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి (59 నాటౌట్) తన సహజశైలిలో అద్భుతంగా ఆడి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. హాజిల్‌వుడ్, యశ్ దయాల్, పాటిదార్ ఆర్సీబీ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. సుయాశ్ శర్మ (4-0-47-1), రసిక్ సలామ్ (3-0-35-1) తలో వికెట్ తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
తొలి మ్యాచ్‌లో గెలుపు అనంతరం పాటిదార్ ఇలా అన్నాడు. ఇలాగే గెలుస్తూ పోతే ఈ సీజన్‌లో టైటిల్ తమదే అని ధీమా వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కావడంతో కాస్త ఒత్తిడికి గురైనట్లు తెలిపాడు. మొత్తంగా ఇది తనకు మంచి రోజని అన్నాడు. సుయాష్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంపై స్పందిస్తూ.. తనకు అభ్యంతరం లేదని తెలిపాడు. సుయాష్ తమ ప్రధాన వికెట్ టేకింగ్ బౌలరని అన్నాడు. కెప్టెన్‌గా అతనికి మద్దతు ఇచ్చానని తెలిపాడు.
పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 3 వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించిన కృనాల్ పాండ్యాను పొగడ్తలతో ముంచెత్తాడు. గెలుపు క్రెడిట్‌లో కృనాల్, సుయాష్‌కు మెజార్టీ వాటా దక్కుతుందని తెలిపాడు. 13 ఓవర్ల తర్వాత వారు ధైర్యం, దృఢ సంకల్పం చూపించారని కితాబునిచ్చాడు. వారిలో వికెట్లు తీయాలనే తపన అద్భుతంగా ఉండిందని కొనియాడాడు.
కోహ్లి గురించి మాట్లాడుతూ.. అతని లాంటి ఆటగాడు జట్టులో ఉండటం అదృష్టమని అన్నాడు. కోహ్లి లాంటి ఆటగాడు జట్టులో ఉంటే కెప్టెన్ పని సులువవుతుందని తెలిపాడు. క్రీడలో గొప్ప ఆటగాడి (కోహ్లి) నుంచి నేర్చుకోవడానికి ఇది తనకు గొప్ప అవకాశమని అన్నాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్‌పై స్పందిస్తూ.. అది ముందుగా నిర్ణయించుకుని ఆడిన షాట అని తెలిపాడు.
కాగా, 2021 సీజన్ నుంచి కేకేఆర్‌తో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఆరింట ఓడింది. గత రెండు సీజన్లలో నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓటమిపాలైంది. తాజా గెలుపుతో ఆర్సీబీ కేకేఆర్‌పై తమ ట్రాక్ రికార్డు కాస్త మెరుగుపర్చుకుంది.
ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో సీఎస్‌కే ఢీకొంటుంది. మార్చి 28న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక నేటి (మార్చి 23) మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్‌లో).. రాత్రి మ్యాచ్‌లో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ (చెన్నై) ఢీకొంటాయి.
Comments
Please login to add a commentAdd a comment