విశాఖ స్పోర్ట్స్/గోపాలపట్నం: ఐపీఎల్‌లో భాగంగా తలపడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ), చైన్నె సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్లు శుక్రవారం సాయంత్రం విశాఖ చేరుకున్నాయి. ఇరు జట్లకు విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. రెండు జట్ల సభ్యులు ప్రత్యేక బస్సుల్లో రోడ్డు మార్గంలో రాడిసన్ బ్లూ హోటల్ వెళ్లారు. పీఎంపాలెంలోని వైఎస్సార్ స్టేడియంలో ఆది వారం ఇరు జట్లు తలపడనుండగా.. శనివారం ప్రాక్టీస్ చేయనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్లు హాట్‌కేక్‌లా నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత 17వ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ మినహా హోం గ్రౌండ్ జట్లే విజయకేతనం ఎగురవేస్తున్నాయి. డీసీ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. డీసీ విశాఖను తొలి సెషన్ మ్యాచ్‌లకు హోం గ్రౌండ్‌గా ఎంచుకుంది. ఇక డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఇప్పటికే సీఎస్‌కే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అయితే ఈ రెండు మ్యాచ్‌లను హోం గ్రౌండ్‌లోనే ఆడి గెలిచింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఇదే ఊపును సీఎస్‌కే కొనసాగిస్తుందా లేక హోం గ్రౌండ్ సెంటిమెంట్‌తో డీసీ గెలుపునకు శ్రీకారం చుడుతుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
మ్యాచ్‌కు అంతా సిద్ధం
విశాఖ స్పోర్ట్స్: ఈ నెల 31న డీసీతో తలపడే సీఎస్‌కే మ్యాచ్‌కు వైఎస్సార్ స్టేడియం సిద్ధమైందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్‌ఆర్ గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా పోలీస్ అధికారుల సహకారంతో బీసీసీఐ నిబంధనల మేరకు సర్వం సిద్ధం చేశామన్నారు. ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి నాయకత్వంలో నాలుగేళ్లలో మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించడంతోనే ఐపీఎల్ మ్యాచ్‌లు కేటాయించారన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో క్రీడాకారులు, మ్యాచ్ నిర్వహణ సిబ్బందికి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment