గెలిచినా లాభం లేదు; క్వాలిఫయింగ్‌ రేసులో లంక, జింబాబ్వే | Ireland Beat UAE By 138 Runs Margin CWC Qualifiers | Sakshi
Sakshi News home page

#CWCQualifiers2023: గెలిచినా లాభం లేదు; క్వాలిఫయింగ్‌ రేసులో లంక, జింబాబ్వే

Published Tue, Jun 27 2023 9:30 PM | Last Updated on Tue, Jun 27 2023 10:47 PM

Ireland Beat UAE By 138 Runs Margin CWC Qualifiers - Sakshi

క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ పోరులో భాగంగా ఐర్లాండ్‌కు ఓదార్పు విజయం దక్కింది. గ్రూప్‌-బిలో మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 138 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్‌ గెలిచినా ఐర్లాండ్‌కు పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఐర్లాండ్‌, ఒమన్‌లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక స్కాట్లాండ్‌పై గెలిచిన శ్రీలంక నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి గ్రూప్‌ టాపర్‌గా సూపర్‌ సిక్స్‌లో అడుగుపెట్టగా.. ఆరు పాయింట్లతో స్కాట్లాండ్‌ రెండో స్థానంలో, ఒమన్‌ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో సూపర్‌సిక్స్‌కు అర్హత సాధించాయి. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. పాల్‌ స్టిర్లింగ్‌ 134 బంతుల్లో 162 పరుగులతో భారీ ఇన్నింగ్స్‌ ఆడగా.. కెప్టెన్‌ ఆండ్రూ బాల్బర్ని 66 పరుగులు, హ్యారీ టెక్టర్‌ 57 పరుగులతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 39 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ ముహ్మద్‌ వసీమ్‌ 45 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సంచిత్‌ శర్మ 44 పరుగులు, బాసిల్‌ హమీద్‌ 39 పరుగులు చేశారు. ఐర్లాండ్‌ బౌలర్లలో కర్టిస్‌ కాంఫర్‌, జార్జ్‌ డొక్రెల్‌, ఆండీ మెక్‌బ్రైన్‌ జోషువా లిటిల్‌లు తలా రెండు వికెట్లు తీశారు.

ఇక క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఇవాళ్టితో లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. సూపర్‌ సిక్స్‌కు వెళ్లిన ఆరుజట్లలో లీగ్‌ దశలో సాధించిన విజయాల ఆధారంగా సాధించిన పాయింట్లను ఐసీసీ పేర్కొంది. సూపర్‌సిక్స్‌ స్టాండింగ్స్‌ ప్రకారం శ్రీలంక నాలుగు, జింబాబ్వే నాలుగు పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.  ఆ తర్వాత స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌ చెరో రెండు పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా.. వెస్టిండీస్‌, ఒమన్‌ జట్లు సున్నా పాయింట్లతో ఆఖరి రెండు స్థానాల్లో నిలిచాయి.

సూపర్‌ సిక్స్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే శ్రీలంక, జింబాబ్వేలు నాలుగేసి పాయింట్లతో ఉండడంతో.. ఈ రెండు జట్లకు అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫయర్‌-1, క్వాలిఫయర్‌-2 హోదాలో  వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప!

చదవండి: క్లియరెన్స్‌ వస్తేనే పాల్గొనేది?.. 'ఆడకపోతే మీ కర్మ'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement