టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పునరాగమనం చేయనున్నాడు. వచ్చే సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనునున్నాడు. రాయల్స్ యాజమాన్యం ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
‘‘టీమిండియా లెజండరీ, ప్రపంచకప్ గెలిపించిన కోచ్ రాజస్తాన్ రాయల్స్‌లోకి సంచలన రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు’’ అంటూ రాయల్స్ సీఈవో జేక్ లష్ మెక్రమ్‌తో ద్రవిడ్ దిగిన ఫొటోను షేర్ చేసింది.
సరికొత్త సవాళ్లకు సిద్ధం
ఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత.. సరికొత్త సవాళ్లకు సిద్ధం కావాలని భావించాను. అందుకు రాయల్స్‌తో జతకట్టడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా.. ‘‘ద్రవిడ్‌తో సంప్రదింపులు ఫలప్రదంగా ముగిశాయి. త్వరలోనే అతను కోచ్ బాధ్యతలు చేపట్టడం ఖాయం’’ అని ఇటీవల రాయల్స్ ఫ్రాంఛైజీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఇప్పుడు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ద్రవిడ్‌తో పాటు టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రం రాథోడ్‌ను కూడా కోచింగ్ సిబ్బందిలోకి తీసుకోవాలని రాయల్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో సారథిగా
కాగా ద్రవిడ్ ఐపీఎల్‌లో రాజస్తాన్‌కు సేవలందించడం ఇదే తొలిసారి కాదు. 2012, 2013 ఎడిషన్లలో రాయల్స్ కెప్టెన్‌గా వ్యహరించిన ద్రవిడ్ రిటైర్మెంట్ అనంతరం.. ఆ జట్టు మెంటార్‌గా రెండేళ్లు పని చేశాడు. అనంతరం 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు.
ఆ తర్వాత.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ‘హెడ్’గా నియమితుడైన ద్రవిడ్.. ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అనంతరం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపికైన ఈ కర్ణాటక ప్లేయర్ రెండున్నరేళ్లపాటు ఆ విధులు నిర్వర్తించాడు. అతడి హయాంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-2023 ఫైనల్, వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరింది.
వరల్డ్ కప్ విన్నర్
అయితే, టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న అతడి కల నెరవేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్‌ల కాంబినేషన్‌లో టీమిండియా కరీబియన్ గడ్డపై ఈ ఏడాది పొట్టి ఫార్మాట్ కప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ద్రవిడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. నిజానికి ద్రవిడ్ పదవీ కాలం కూడా గత ఏడాది వన్డే ప్రపంచకప్‌తోనే ముగిసింది. అయినా.. ఈ మెగా టోర్నీ ముగిసే వరకు కోచ్‌గా సేవలు అందించి.. ఐసీసీ టైటిల్‌తో తన ప్రయాణం ముగించాడు.
ఇదిలా ఉంటే.. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇప్పటి వరకు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌కు సంబంధించిన బార్బడోస్ రాయల్స్... కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో, పార్ల్ రాయల్స్... సౌతాఫ్రికా20 టోర్నీల్లో పాల్గొంటున్నాయి. ఆయా లీగ్‌లలో విజయాలే లక్ష్యంగా సహాయ సిబ్బందిలో దిగ్గజాలను నియమించుకుంటోంది రాయల్స్.
Comments
Please login to add a commentAdd a comment