ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) మొట్టమొదటి ఎడిషన్‌లో (2024) తెలంగాణ టైగర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ లెజెండ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 25) జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ టైగర్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తెలంగాణ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా.. ఛేదనలో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. రాజస్థాన్ 7 వికెట్ల నష్టానికి 172 పరుగులకు పరిమితమై అతి స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.
మెరిసిన శివ భరత్..
ఓపెనర్ శివ భరత్ కుమార్ సాగిరి (59 బంతుల్లో 87 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తెలంగాణ భారీ స్కోర్ చేసింది. తెలంగాణ ఇన్నింగ్స్‌లో దిల్షన్ మునవీర 27, రికార్డో పావెల్ 20, మన్‌ప్రీతి గోని 25 పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో పర్విందర్ అవానా 2, సెక్కుగే ప్రసన్న, ఇషాన్ మల్హోత్రా, లఖ్విందర్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్.. తెలంగాణ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో లక్ష్యానికి అతి సమీపంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. తంగిరాల పవన్ కుమార్, తిలక్, ఖాద్రి తలో 2 వికెట్లు, సందీప్ త్యాగి ఓ వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఏంజెలో పెరీరా (32), ఇషాన్ మల్హోత్రా (36), రాజేశ్ బిష్ణోయ్ (44) రాజస్థాన్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.
కాగా, IVPL 2024 ఎడిషన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ నెల 23న జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై.. తెలంగాణపై, ఆతర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో చత్తీస్‌ఘడ్‌పై ఢిల్లీ, నిన్న జరిగిన మూడో మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఉత్తర్ ప్రదేశ్ గెలుపొందాయి. ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. రాత్రి ఏడు గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ లీగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment