Jeremy Chardy calls chair umpire a 'liar' after Australian Open exit - Sakshi
Sakshi News home page

Australian Open: మ్యాచ్‌ పట్టించుకోకుండా పక్షులు, ఆకాశంకేసి చూస్తున్నారా!?

Published Thu, Jan 19 2023 3:10 PM | Last Updated on Thu, Jan 19 2023 4:56 PM

Jeremy Chardy Calls Chair Umpire Bad Umpire After Australian Open Exit - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకంది. చైర్‌ అంపైర్‌ చేసిన చిన్న తప్పిదం కారణంగా తాను మ్యాచ్‌ ఓడిపోవాల్సి వచ్చిందంటూ ఫ్రెంచ్‌ టెన్నిస్‌ స్టార్‌ జెరెమీ కార్డీ ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. విషయంలోకి వెళితే.. పురుషుల సింగిల్స్‌లో గురువారం బ్రిటన్‌కు చెందిన డాన్‌ ఎవన్స్‌(27వ ర్యాంక్‌), జెరెమీ కార్డీ మధ్య రెండో రౌండ్‌ మ్యాచ్‌ జరిగింది.

తొలి సెట్‌లో ఇరువురు 3-3తో సమానంగా ఉన్నారు. కీలకమైన టైబ్రేక్‌ పాయింట్‌ సమయం కావడంతో ఇద్దరు సీరియస్‌గా ఆడుతున్నారు. ఎవన్స్‌ బంతిని సర్వీస్‌ చేయగా.. జెరెమీ షాట్‌ ఆడాడు. ఆ తర్వాతి టర్న్‌లో జెరెమీ ఫోర్‌హ్యాండ్‌ షాట్‌ ఆడే సమయంలో అతని జేబు నుంచి బంతి కిందపడింది. ఇది గమనించిన జెరెమీ చైర్‌ అంపైర్‌కు సిగ్నల్‌ ఇచ్చాడు. కానీ ఆమె పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎవన్స్‌ కూడా గమనించకుండా షాట్‌ కొట్టడం.. జెరెమీ షాట్‌ మిస్‌ కావడంతో బంతి నెట్‌కు తగిలింది. దీంతో ఎవన్స్‌కు పాయింట్‌ లభించినట్లయింది.

అయితే దీనిపై జెరెమీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. చైర్‌ అంపైర్‌ మాత్రం పోనీలే అన్న తరహాలో ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వడంతో జెరెమీకి చిర్రెత్తుకొచ్చింది. ఎవన్స్‌ ఈ విషయంలో తాను దూరలేనని పక్కకి వెళ్లి కూర్చొన్నాడు. చైర్‌ అంపైర్‌తో జెరెమీ చాలా సేపు వాదించాడు. బంతి జేబులో నుంచి పడిందని సిగ్నల్‌ ఇచ్చినా పట్టించుకోలేదన్నాడు. మ్యాచ్‌ను చూడకుండా పైనున్న ఆకాశం, పక్షులను చూస్తూ కూర్చొన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కెరీర్‌లో మీ అంత బ్యాడ్‌ అంపైర్‌ను ఎప్పుడు చూడలేదన్నాడు. ఆ తర్వాత టోర్నీ నిర్వాహకులు వచ్చి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌లో జెరెమీ కార్డీ ఓటమి పాలయ్యాడు. డాన్‌ ఎవన్స్‌ చేతిలో జెరెమీ కార్డీ 6-4, 6-4, 6-1తో వరుస సెట్లలో ఖంగుతిన్నాడు. చైర్‌ అంపైర్‌తో వివాదం తనను విజయానికి దూరం చేసిందని జెరెమీ కార్డీ మ్యాచ్‌ ముగిసిన అనంతరం పేర్కొనడం ఆసక్తి కలిగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement