
Kapil Dev Channels Ranveer Singh In Hilarious Advertisement: క్రికెట్ దిగ్గజం, భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన యోధుడు, లెజండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ మైదానంలో ఎంత సౌమ్యంగా ఉండేవాడో అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి తన సహజ స్వభావానికి విరుద్ధంగా వెక్కిలి చేష్టలు చేస్తూ, రంగురంగుల దుస్తుల్లో.. భిన్నంగా కనిపించాడు. ఇదంతా చేసింది నిజ జీవితంలో అనుకుంటే పొరపాటే. ప్రముఖ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు యాప్ 'క్రెడ్' ప్రకటన కోసం కపిల్ ఇలా నటించాడు. ఈ యాడ్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ బాడీ లాంగ్వేజ్‌ని అనుకరిస్తూ.. కపిల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
Heads, I'm fashionable. Tails, I'm still fashionable. pic.twitter.com/vyKIrmLLOD
— Kapil Dev (@therealkapildev) October 15, 2021
క్రికెట్ మైదానంలో ధగధగ మెరిసే దుస్తులు ధరించి, ప్రత్యర్థులను స్లెడ్జింగ్ చేస్తూ.. సైడ్ ఆర్మ్ బౌలింగ్ చేస్తూ నవ్వులు పూయించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తన సహజత్వానికి భిన్నంగా కపిల్ ఇలా దర్శనమివ్వడంతో అభిమానులు అవాక్కవుతున్నారు. కపిల్ ఇలా కూడా ఉంటాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వెంకటేష్ ప్రసాద్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా వంటి ప్రముఖులు గతంలో ఈ యాడ్‌లో సందడి చేశారు.
ఇదిలా ఉంటే, కపిల్ దేవ్ టీమిండియాకు 1983 వన్డే ప్రపంచకప్‌ను అందించిన వైనాన్ని ఆధారంగా చేసుకుని.. రణ్‌వీర్ సింగ్ హీరోగా 83 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో కపిల్ పాత్రలో రణ్‌వీర్ ఒదిగిపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు రివర్స్‌గా కపిల్ కూడా రణ్‌వీర్‌ను అనుకరించేందుకు ఈ యాడ్‌లో నటించినట్లు సమాచారం. ఈ వీడియోను కపిల్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'నేను ఎంతో ఫ్యాషన్‌గా ఉన్నాను. ఇప్పటికీ నేను ఫ్యాషన్‌గా ఉన్నాను' అంటూ క్యాప్షన్ కూడా జోడించాడు.
చదవండి: రేపటి నుంచే మరో మహా క్రికెట్ సంగ్రామం..