Kapil Dev Slams Virat Kohli, KL Rahul, Rohit Sharma When Time To Take Off Innings They Out - Sakshi
Sakshi News home page

Kohli- Rohit- Rahul: పేరు ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టు ఆడాలి: భారత దిగ్గజం ఘాటు విమర్శలు

Published Mon, Jun 6 2022 11:44 AM | Last Updated on Mon, Jun 6 2022 1:26 PM

Kapil Dev Slams Kohli Rohit Rahul When Time To Take Off Innings They Out - Sakshi

రాహుల్‌, కోహ్లి, రోహిత్‌

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, సారథి రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ విమర్శలు గుప్పించారు. ఈ ముగ్గురు జట్టుకు అవసరమైన సమయంలో చేతులెత్తేస్తున్నారని పెదవి విరిచారు. ఇకనైనా వీరు ముగ్గురు బాధ్యతాయుతంగా ఆడాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా కోహ్లి, రోహిత్‌ ఫామ్‌లేమి జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కాబట్టి వారు ఇప్పటికైనా ఆటను మెరుగుపరచుకోవాలని హితవు పలికారు.

కోహ్లి, రోహిత్‌ ఫ్లాప్‌ షో!
కాగా గత కొన్నాళ్లుగా విరాట్‌ కోహ్లి స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అదే విధంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం ఐపీఎల్‌-2022లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఆర్సీబీ బ్యాటర్‌ విరాట్‌ 341 పరుగులు చేస్తే... ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ కేవలం 268 పరుగులు మాత్రమే సాధించాడు.

అంతేగాక అతడి సారథ్యంలోని ముంబై పాయిం‍ట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఘోర వైఫల్యంతో ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ ముగించిన వీరిద్దరు దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. కోహ్లి, రోహిత్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో వైస్‌ కెప్టెన్‌ ప్రొటిస్‌తో టీ20 సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.


కపిల్‌ దేవ్‌

సత్తా ఉంది.. కానీ
ఈ పరిణామాల నేపథ్యంలో కోహ్లి, రాహుల్‌, రోహిత్‌ను ఉద్దేశించి కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్లకు ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఒత్తిడి సహజం. అయితే, కేవలం దానిని సాకుగా చూపితే సరిపోదు. 

ఒత్తిడిని అధిగమించి బ్యాట్‌ ఝులిపించగలగాలి. వాళ్లకు 150-160 స్ట్రైకు రేటుతో బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉంది. కానీ, ఎప్పుడైతే వాళ్లు మెరుగైన స్కోరు సాధించాలని మనం కోరుకుంటామో అప్పుడే చేతులెత్తేస్తారు. అప్పుడు ఒత్తిడి ఇంకాస్త ఎక్కువవుతుంది’’ అని అనకట్‌ యూట్యూబ్‌ చానెల్‌తో కపిల్‌ దేవ్‌ పేర్కొన్నారు.

అలా అయితే అన్యాయం చేసినట్లే!
అదే విధంగా కేఎల్‌ రాహుల్‌ నుంచి గొప్ప ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నామన్న కపిల్‌ దేవ్‌.. ఐపీఎల్‌ క్వాలిఫైయర్‌-1లో ఆర్సీబీతో మ్యాచ్‌లో అతడి ఆట తీరును ప్రస్తావించారు. ‘‘కేఎల్‌ రాహుల్‌ గురించి చెప్పాలంటే.. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయాలని మేనేజ్‌మెంట్‌ కోరుకుందంటే.. దాని అర్థం కేవలం 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం కాదు. ఇలా చేస్తే జట్టుకు అన్యాయం చేసినట్లే. 

ఆడే విధానం మార్చుకోవాలి. ఒకవేళ అలా కుదురకపోతే ఆటగాళ్లను మార్చేయాలి. భారీ అంచనాలు ఉన్న ఆటగాడు బాగా ఆడతాడనే ఎవరైనా ఊహిస్తారు.పేరు ప్రఖ్యాతులు ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్లు రాణించాలి కూడా’’ అని కపిల్‌ దేవ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా కొత్త జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ అయిన రాహుల్‌.. జట్టును తొలి సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ చేర్చడంలో సక్సెస్‌ అయ్యాడు. అయితే, కొన్ని కీలక మ్యాచ్‌లలో ఎక్కువ బంతులు తీసుకుని తక్కువ స్కోరు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కపిల్‌ దేవ్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

చదవండి👉🏾Test Cricket: రూట్‌ త్వరలోనే సచిన్‌ రికార్డు బద్దలు కొడతాడు: ఆసీస్‌ మాజీ కెప్టెన్‌
చదవండి👉🏾IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. వెంకటేష్ అయ్యర్‌, దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement