అనుకున్నదే అయ్యింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్-2023తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు (జూన్ 7 నుంచి) కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. అతి త్వరలో తాను తొడ భాగంలో శస్త్ర చికిత్స చేయించుకుంటున్నట్లు రాహుల్ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.
ఐపీఎల్-2023తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి అర్ధంతరంగా వైదొలగాల్సి వస్తున్నందుకు నిరాశ వ్యక్తం చేశాడు. గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి జట్టులో చేరేందుకు తన వంతు ప్రయత్నాలన్నీ చేస్తానని తెలిపాడు. కాగా, కొద్ది రోజుల ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో సభ్యుడు జయదేవ్ ఉనద్కత్ కూడా గాయం కారణంగా అధికారికంగా ఐపీఎల్-2023 నుంచి వైదొలిగాడు.
ఉనద్కత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. రాహుల్, ఉనద్కత్‌లు గాయాల కారణంగా ఒకేసారి వైదొలగడంతో లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఒకవేళ ఉనద్కత్ డబ్ల్యూటీసీ ఫైనల్ సమయానికి కూడా కోలుకోకపోతే అది టీమిండియాకు కూడా భారీ ఎదురుదెబ్బగా పరిగణించాల్సి ఉంటుంది.
గాయాల కారణంగా ఇప్పటికే బుమ్రా, శ్రేయస్ అయ్యర్ జట్టుకు (డబ్ల్యూటీసీ ఫైనల్) దూరం కాగా.. తాజాగా రాహుల్ కూడా గాయం కారణంగా వైదొలగడం టీమిండియా విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా కేఎల్ రాహుల్, అదే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా ఉనద్కత్ గాయాల బారిన పడిన విషయం తెలిసిందే.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ (ఔట్), పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్.
Comments
Please login to add a commentAdd a comment