కోల్‌'కథ' ఎంతవరకు! | Knight Riders enter the Indian Premier League as defending champions | Sakshi
Sakshi News home page

కోల్‌'కథ' ఎంతవరకు!

Published Thu, Mar 20 2025 3:50 AM | Last Updated on Thu, Mar 20 2025 8:49 AM

Knight Riders enter the Indian Premier League as defending champions

డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి నైట్‌రైడర్స్‌

ఇప్పటికే మూడుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ కైవసం

రింకూ సింగ్, వరుణ్‌ చక్రవర్తిలపైనే అందరి దృష్టి

మరో 2 రోజుల్లో ఐపీఎల్‌

ఏ జట్టయినా విజయవంతమైన కూర్పును కొనసాగించాలనుకుంటుంది... కానీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాత్రం అందుకు విభిన్నమైన ప్రణాళికలతో అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. దశాబ్దకాలం తర్వాత తమ జట్టుకు ఐపీఎల్‌ ట్రోఫీ అందించిన కెపె్టన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను వేలానికి వదిలేసుకున్న నైట్‌రైడర్స్‌... ఓ మామూలు ఆటగాడి కోసం భారీగా ఖర్చు పెట్టింది. జాతీయ జట్టుకు దూరమైన సీనియర్‌ ప్లేయర్‌ అజింక్య రహానేకు పిలిచి మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. 

అయితే ఎన్ని మార్చినా కోర్‌ గ్రూప్‌ను మాత్రం కదల్చని కోల్‌కతా... డిఫెండింగ్‌ చాంపియన్‌గా టైటిల్‌ నిలబెట్టుకునేందుకు సై అంటోంది! ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు మాత్రమే ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండేళ్లు చాంపియన్‌గా నిలిచాయి. నైట్‌రైడర్స్‌ ఈసారి తమ గెలుపు ‘కథ’ను ఎంతవరకు తీసుకెళ్తుందనేది ఆసక్తికరం కానుంది!    –సాక్షి క్రీడావిభాగం  

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ చెరో ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకోగా... ఆ తర్వాత అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) మూడుసార్లు విజేతగా నిలిచింది. 2012, 2014, 2024లో కేకేఆర్‌ ట్రోఫీ హస్తగతం చేసుకుంది. గతేడాది ఐపీఎల్‌ వేలంలో ‘కోర్‌ గ్రూప్‌’ను తిరిగి కొనసాగించిన ఫ్రాంచైజీ... జట్టుకు మూడోసారి కప్పు అందించిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్, ఆ్రస్టేలియా స్టార్‌ పేసర్‌ స్టార్క్‌ను మాత్రం వదిలేసుకుంది. 

పేస్‌ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ కోసం ఏకంగా రూ. 23 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసి ఆశ్చర్యపరిచిన యాజమాన్యం... కోటిన్నర ప్రాథమిక ధరతో కొనుగోలు చేసుకున్న సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానేకు అనూహ్యంగా కెప్టెన్సీ  పగ్గాలు అప్పగించింది. వేలంలో ఒక్కో జట్టు అత్యధికంగా 25 మందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉండగా... కేకేఆర్‌ 21 మందినే తీసుకుంది. 

సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు రూ. 13 కోట్లు... ‘మిస్టరీ స్పిన్నర్‌’ వరుణ్‌ చక్రవర్తి, వెస్టిండీస్‌ టి20 స్పెషలిస్ట్‌లు రసెల్, నరైన్‌లకు రూ. 12 కోట్లు చొప్పున అందించి అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ... హర్షిత్‌ రాణా, రమణ్‌దీప్‌లను రూ. 4 కోట్లతో కొనసాగించింది. ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంటే దాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంది.  

నరైన్‌పై భారీ అంచనాలు... 
సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రకాంత్‌ పండిత్‌ కేకేఆర్‌కు కోచ్‌గా వ్యవహరిస్తుండగా... గతేడాది జట్టుకు మెంటార్‌గా ఉన్న గౌతమ్‌ గంభీర్‌ ... టైటిల్‌ గెలిచిన అనంతరం టీమిండియా హెడ్‌ కోచ్‌గా వెళ్లిపోయాడు. ఇప్పుడతడి స్థానంలో విండీస్‌ మాజీ ఆటగాడు డ్వేన్‌ బ్రావో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ముంబై, చెన్నై జట్లు మాత్రమే వరుసగా రెండు సీజన్లు విజేతగా నిలిచాయి. 

ఇప్పుడు కోల్‌కతా ముందు అలాంటి అరుదైన అవకాశం మూడోసారి ఉంది. వెస్టిండీస్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ నరైన్‌ను ఓపెనర్‌గా దింపి మెరుగైన ఫలితాలు రాబట్టిన కేకేఆర్‌ ఈసారి కూడా అదే ప్లాన్‌ అనుసరిస్తుందనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికిన నరైన్‌... కేకేఆర్‌ తరఫున అటు స్పిన్నర్‌గా ఇటు ఓపెనర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

గత సీజన్‌లో 488పరుగులు, 17 వికెట్లు తీసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. గుర్బాజ్, నరైన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించడం ఖాయమే కాగా... అజింక్య రహానే, వెంకటేశ్‌ అయ్యర్, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్‌ సింగ్‌ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు రానున్నారు. బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తి, నరైన్, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా కీలకం కానున్నారు.  

రహానే రాణించేనా? 
డిఫెండింగ్‌ చాంపియన్‌గా మరింత బాధ్యతగా ఉండాల్సిన కేకేఆర్‌... తన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచింది. కప్పు అందించిన కెపె్టన్‌ను వదిలేసుకోవడం... తుదిజట్టులో ఉంటాడో లేదో నమ్మకంగా చెప్పలేని ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పగించడం... వెరసి సీజన్‌ ఆరంభానికి ముందే వార్తల్లో నిలిచింది. ఫామ్‌లేమికి తోడు వయసు మీదపడుతున్న కారణంగా భారత జట్టుకు దూరమైన రహానే మరి కేకేఆర్‌ను ఎలా నడిపిస్తాడో చూడాలి. 

వెంకటేశ్‌ అయ్యర్‌ వైస్‌ కెప్టెన్ గా వ్యవహరించనుండగా... ఆస్థాన ఆటగాళ్లు రసెల్, నరైన్‌ కేకేఆర్‌కు ప్రధాన బలంకానున్నారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఈ ఇద్దరు జట్టుకు చేకూర్చే విలువ మాటల్లో చెప్పలేనిది. ఇటీవల చాంపియన్స్‌ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చిన వరుణ్‌ చక్రవర్తిపై భారీ అంచనాలు ఉన్నాయి. 

నోర్జే, స్పెన్సర్‌ జాన్సన్, హర్షిత్‌ రాణా, రావ్‌మన్‌ పావెల్, వైభవ్‌ అరోరాతో పేస్‌ విభాగం బలంగానే ఉన్నా... వీరు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి. విదేశీ ఆటగాళ్ల కోటాలో నరైన్, రసెల్, గుర్బాజ్‌ తుది జట్టులో ఉండటం పక్కా కాగా... నాలుగో ప్లేయర్‌గా నోర్జే, మొయిన్‌ అలీలలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు: రహానే (కెప్టెన్‌), రింకూ సింగ్, డికాక్, గుర్బాజ్, రఘువంశీ, పావెల్, మనీశ్‌ పాండే, లవ్‌నిత్‌ సిసోడియా, వెంకటేశ్‌ అయ్యర్, అనుకూల్‌ రాయ్, మొయిన్‌ అలీ, రమణ్‌దీప్, రసెల్, నోర్జే, వైభవ్, మయాంక్‌ మార్కండే, స్పెన్సర్‌ జాన్సన్, హర్షిత్‌ రాణా, నరైన్, వరుణ్, చేతన్‌ సకారియా. 

అంచనా: డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న కేకేఆర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో నాణ్యమైన ప్లేయర్లు ఉన్న కోల్‌కతా... స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తే ఫైనల్‌కు చేరడం పెద్ద కష్టం కాదు. రహానే జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement