చేతన్ శర్మ (PC: X)
Ind vs Eng 2024 Test Series: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అన్నాడు. తొలి టెస్టులో ఓడినా మిగిలిన నాలుగూ గెలిచి 4-1 తేడాతో ట్రోఫీని గెలుస్తుందని జోస్యం చెప్పాడు.
కీలక ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ జట్టుతో లేకపోయినా వరుస విజయాలు సాధిస్తుందని చేతన్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా వైఫల్యం తర్వాత చేతన్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజులకే చేతన్ శర్మ తిరిగి నియమితుడు కాగా.. కమిటీలో నలుగురు కొత్త సభ్యులకు చోటు దక్కింది. కానీ.. బీసీసీఐ తనకు ఇచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఓ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో.. ‘‘టీమిండియా క్రికెటర్లు పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించకపోయినా ఇంజక్షన్లు వేసుకుని మైదానంలో దిగుతారు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. క్రీడా వర్గాల్లో సంచలనం రేకెత్తించిన చేతన్ శర్మ వ్యాఖ్యల వల్ల అతడి పదవి ఊడింది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలక్టర్‌గా చేతన్ స్థానంలో బాధ్యతలు చేపట్టాడు. ఇదిలా ఉంటే.. చాలా రోజుల తర్వాత చేతన్ శర్మ మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు.
అప్పుడు కూడా ఇలాగే జరిగింది
ఇండియా టుడేతో మాట్లాడుతూ టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘అతిథులకు స్వాగతం పలికే క్రమంలో మనం వాళ్లకు ఓ అవకాశం ఇచ్చి ఉంటాం.
కొన్నిసార్లు తప్పులు జరగడం సహజం. అయినా తొలి టెస్టులో టీమిండియా తప్పేమీ చేయలేదు. బాగా ఆడినా కూడా ఓడిపోయింది. మూడేళ్ల క్రితం కూడా మనం ఇలాగే చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయాం. కానీ ఆ తర్వాత వాళ్లను 3-1తో చిత్తు చేశాం.
ఇప్పుడు కూడా అదే చరిత్ర పునరావృతం కాబోతోంది. రెండో టెస్టు నుంచి టీమిండియా మరింత దూకుడు పెంచడం ఖాయం. కచ్చితంగా ఈ సిరీస్‌ను 4-1తో గెలిచి తీరుతుంది’’ అని చేతన్ శర్మ అంచనా వేశాడు. కాగా ఫాస్ట్‌బౌలర్ చేతన్ శర్మ టీమిండియా తరఫున 23 టెస్టులాడి 396, 65 వన్డేల్లో 456 రన్స్ తీశాడు. అదేవిధంగా ఆయా ఫార్మాట్లలో వరుసగా 61, 67 వికెట్లు కూలగొట్టాడు.
విశాఖపట్నంలో రెండో టెస్టు
ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎదురైన ఈ పరాభవానికి.. విశాఖపట్నంలో బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 2 నుంచి ఇరుజట్ల మధ్య డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో రెండో టెస్టు మొదలుకానుంది.
చదవండి: Ind vs Eng 2nd Test Vizag: రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment