వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి
అబుదాబి: యూఏఈ గడ్డపై గత రెండు రోజులు చప్పగా సాగిన మ్యాచ్‌లకు, బోర్ కొట్టిన ప్రేక్షకులకు చక్కటి మెరుపు విందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇచ్చింది. సిక్సర్లు, ఫోర్లతో 150 పైచిలుకు లక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే ముగించేసింది. ఐపీఎల్‌లో గురువారం జరిగిన పోరులో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
ఓపెనర్ డికాక్ (42 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. ఫెర్గూసన్, ప్రసిధ్ కృష్ణ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ త్రిపాఠి (42 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. కోల్‌కతా కోల్పోయిన మూడు వికెట్లు బుమ్రాకే దక్కాయి. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠిలకు కాకుండా రోహిత్ శర్మ వికెట్ తీసిన స్పిన్నర్ సునీల్ నరైన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కడం గమనార్హం.
ఓపెనింగ్ అదిరినా...
కోల్‌కతా జట్టు పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్ నితీశ్ రాణాతో తొలి ఓవర్ వేయించి ఆశ్చర్యపరిచింది. ముంబైకి ఓపెనింగ్ జోడీ ఇచ్చిన శుభారంభం... వంద స్కోరు దాకా 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన వైనం చూస్తే... భారీ స్కోరు తథ్యమనిపించింది. కానీ 150 పరుగుల పైచిలుకు పరుగులతోనే సర్దుకుంది. ఓపెనర్లలో ముందుగా అదరగొట్టింది రోహిత్ శర్మే. బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచాడు. కాసేపటికే డికాక్ ఈ వేగానికి సిక్సర్లతో మెరుపుల్ని జతచేశాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఒకటి, ప్రసిధ్ కృష్ణ ఓవర్లో రెండు సిక్సర్లు బాదేయడంతో పవర్ ప్లేలో ముంబై 56/0 స్కోరు చేసింది.
తర్వాత రసెల్‌ను బౌలింగ్‌కు దించినా డికాక్ వరుస బౌండరీలతో తన జోరు చూపాడు. కానీ తర్వాతి పదో ఓవర్లో నరైన్... రోహిత్ శర్మ (30 బంతుల్లో 33; 4 ఫోర్లు)ను ఔట్ చేసి 78 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరదించాడు. సూర్యకుమార్ (5)ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో డికాక్ క్రీజులో ఉన్నా... ఇషాన్ కిషన్ (14; 1 సిక్స్) లాంటి హిట్టర్ జతయినా ముంబై స్కోరు మందగించింది. డికాక్ 37 బంతుల్లో ఫిఫ్టీ (3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూర్తి చేసుకున్న కాసేపటికే పెవిలియన్ బాటపట్టాడు. పొలార్డ్ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ (12) వారి శైలికి తగ్గట్లు ధాటిగా ఆడలేకపోయారు.
సిక్సర్లతో షురూ...
ఆట మొదలైందో లేదో చకచకా బాదేసే పనిలో పడ్డారు కోల్‌కతా ఓపెనర్లు. బౌల్ట్ లాంటి మేటి బౌలర్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని శుబ్‌మన్ గిల్ (13), నాలుగో బంతిని వెంకటేశ్ అయ్యర్ సిక్సర్లుగా బాదారు. తర్వాత మిల్నేకు 6, 4, 4లతో అయ్యర్ తన తడాఖా చూపెట్టాడు. 2 ఓవర్లకే నైట్‌రైడర్స్ స్కోరు 30/0. బుమ్రా వేసిన మూడో ఓవర్‌లో ఇద్దరు చెరో బౌండరీ కొట్టారు. కానీ బుమ్రా... గిల్‌ను బోల్తా కొట్టించాడు. తొలి 3 ఓవర్లలోనే 40 పరుగులు రావడంతో తర్వాత కాస్త నింపాదిగా ఆడినాసరే జట్టు రన్‌రేట్ లక్ష్యాన్ని కరిగించే వరకు పది పరుగులకు దిగనేలేదు.
అయ్యర్ తన ధాటిని కొనసాగించాడు. రాహుల్ త్రిపాఠి ముందు జాగ్రత్త పడ్డాడు... తర్వాత ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఇన్నింగ్స్ పదో ఓవర్లో జట్టు స్కోరు 100 దాటింది. 11వ ఓవర్లో అయ్యర్ 25 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్స్‌లు), 12వ ఓవర్లో త్రిపాఠి 29 బంతుల్లో (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలను ధనాధన్‌గా అధిగమించారు. అయ్యర్ ఔటైనా త్రిపాఠి నిలబడి మిగతా లాంఛనాన్ని 15.1 ఓవర్లలోనే పూర్తి చేశాడు.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) శుబ్‌మన్ గిల్ (బి) నరైన్ 33; డికాక్ (సి) నరైన్ (బి) ప్రసిధ్ కృష్ణ 55; సూర్యకుమార్ (సి) దినేశ్ కార్తీక్ (బి) ప్రసిధ్ కృష్న 5; ఇషాన్ కిషన్ (సి) రసెల్ (బి) ఫెర్గూసన్ 14; పొలార్డ్ (రనౌట్) 21; కృనాల్ (సి) వెంకటేశ్ (బి) ఫెర్గూసన్ 12; సౌరభ్ తివారీ (నాటౌట్) 5; మిల్నే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155.
వికెట్ల పతనం: 1–78, 2–89, 3–106, 4–119, 5–149, 6–149.
బౌలింగ్: నితీశ్ రాణా 1–0–5–0, వరుణ్ చక్రవర్తి 4–0–22–0, సునీల్ నరైన్ 4–0–20–1, ఫెర్గూసన్ 4–0–27–2,
ప్రసిధ్ కృష్ణ 4–0–43–2, రసెల్ 3–0–37–0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ గిల్ (బి) బుమ్రా 13; వెంకటేశ్ అయ్యర్ (బి) బుమ్రా 53; రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 74; మోర్గాన్ (సి) బౌల్ట్ (బి) బుమ్రా 7; నితీశ్ రాణా (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (15.1 ఓవర్లలో 3 వికెట్లకు) 159.
వికెట్ల పతనం: 1–40, 2–128, 3–147.
బౌలింగ్: బౌల్ట్ 2–0–23–0, మిల్నే 3–0–29–0, బుమ్రా 4–0–43–3, కృనాల్ 3–0–25–0, రాహుల్ చహర్ 3–0–34–0, రోహిత్ శర్మ 0.1–0–4–0.
Comments
Please login to add a commentAdd a comment