న్యూఢిల్లీ: ఏ ఆటగాడైనా... సరే ప్రాబబుల్స్‌లో చోటు దక్కి.. తుదిజట్టులో ఆడే అవకాశం రాకపోతే నిరాశ పడటం సహజం. అది కూడా ఏళ్ల తరబడి ఎదురుచూడటం విసుగు తెప్పించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియాతో రెండేళ్ల క్రితం జరిగిన టెస్టు సిరీస్‌లో చివరిసారిగా టెస్టు క్రికెట్ ఆడిన కుల్దీప్... ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండోటెస్టుతో పునరాగమనం చేశాడు.
అయితే, ఆ మ్యాచ్‌లో 6.2 ఓవర్లు వేసిన కుల్దీప్.. 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ ఆ తర్వాత మ్యాచ్‌లలో ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు. అంతేకాదు పుణెలో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో అతడిని పక్కనపెట్టారు. టెస్టులు, వన్డేల సంగతి ఇలా ఉంటే.. కుల్దీప్ 16 నెలలుగా ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడలేకపోయాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడికి యాజమాన్యం ప్రాధాన్యం ఇవ్వలేదు. స్పిన్ విభాగంలో సునిల్ నరైన్, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తిని ఎక్కువగా వినియోగించుకుంది.
ఈ పరిణామాల గురించి కుల్దీప్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘‘నాన్‌స్టాప్‌గా ఆడుతూ ఉంటే.. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ ప్రతిసారీ బెంచ్ మీదే కూర్చోవాల్సి వస్త పరిస్థితులు కఠినంగా మారతాయి. ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. నేను చాలా కాలం తర్వాత ఫిబ్రవరిలో చెన్నైలో ఇంగ్లండ్‌తో టెస్టు ఆడినపుడు ఇలాగే అనిపించింది. మరోవైపు కోవిడ్ కల్లోలం పరిస్థితులను మరింత ప్రతికూలంగా మార్చింది. అసలు నాకు ఒక్కోసారి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కఠిన సమయాల్లో నా మనసు ఒకటే మాట చెబుతుంది.. నువ్వు మనుపటి కుల్దీప్ కాదేమో.. బహుశా అలా ఉండలేవేమోనని.. డ్రింక్స్ మోస్తూ... పదే పదే బెంచ్ మీద కూర్చోవడం.. చాలా కఠినంగా ఉంటుంది’’ అని చేదు అనుభవాలు పంచుకున్నాడు.
ఇక ఐపీఎల్ గురించి చెబుతూ... ‘‘కేకేఆర్ తరఫున ఆడే అవకాశం రాకపోవడం నన్ను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ‘‘నేను మరీ అంతపనికిరాని వాడినా? చెత్తగా ఆడతానా? అని అనిపించింది. ఈ విషయం మేనేజ్‌మెంట్ను అడగడం భావ్యం కాదు. కానీ చెన్నైలో నన్ను ఆడించకపోవడం నిజంగా షాకింగ్‌గా అనిపించింది’’ అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా జూన్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే 18 మంది ప్రాబబుల్స్‌తో కూడిన జట్టులోనూ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. దీంతో అతడిని దురదృష్టం వెంటాడుతోందంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ICC WTC Final: భారత జట్టు
Comments
Please login to add a commentAdd a comment