రేపు (జనవరి 22) అయోధ్యలో జరిగే బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్‌కు సంబంధించి కూడా పలువురు దిగ్గజాలకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిన వారిలో దిగ్గజ క్రికెటర్, భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ టెండుల్కర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ ఉన్నారు.
వీరితో పాటు టీమిండియా మాజీ ఆటగాళ్లు, ఎంపీలు హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అయోధ్యను సందర్శించనున్నారు. భారత మహిళల క్రికెట్‌కు సంబంధించి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు ఆహ్వానం అందింది.
ఆహ్వానం అందిన వారిలో దాదాపుగా అందరూ కుటుంబసమేతంగా అయోధ్యకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత భారత జట్టు సభ్యులైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నప్పటికీ.. జనవరి 22న ప్రాక్టీస్‌ను పక్కకు పెట్టి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగం కానున్నట్లు తెలుస్తుంది. వీరు మరికొంతమంది క్రికెట్ ప్రముఖులతో కలిసి ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇందు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని సమాచారం.
కాగా, భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు చెందిన చాలా మంది ప్రముఖులు రేపు బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామ నామ జపంతో అయోధ్య నగరం మారుమోగిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment