
టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా పాపువా న్యూగినీతో మ్యాచ్‌లో ఫెర్గూసన్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.
ఈ మ్యాచ్‌లో ఫెర్గుసన్ ఎవరూ ఊహించని విధంగా తన 4 ఓవర్ల కోటాను మెయిడిన్లుగా ముగించాడు. ఫెర్గూసన్ 4 ఓవర్లు వేసి ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా 3 వికెట్లు కూడా పడగొట్టాడు.
పసికూన పాపువా న్యూగినీ బ్యాటర్లకు ఈ కివీస్పీడ్ స్టార్ చుక్కలు చూపించాడు. అతడిని ఎదుర్కొనేందుకు న్యూగినీ బ్యాటర్లు గజగజ వణికిపోయారు.
పపువా న్యూ గినియా ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో బంతిని అందుకున్న ఫెర్గూసన్ తొలి బంతికే వికెట్ తీసాడు. ఆ ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించిన లాకీ.. ఏడో ఓవర్‌లో మరోసారి బంతిని అందుకుని రెండోసారి మెయిడిన్ చేశాడు.
మళ్లీ 12వ ఓవర్ బౌలింగ్ చేసిన ఫెర్గూసన్ రెండో బంతికి వికెట్ తీసి మూడో ఓవర్‌ను మెయిడిన్ చేశాడు. 14వ ఓవర్‌లో రెండో బంతికి మరో వికెట్ తీసి మరోసారి మెయిడిన్ చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఫెర్గూసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
ఫెర్గూసన్ సాధించిన రికార్డులు ఇవే..
అంతర్జాతీయ టీ20ల్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా ఫెర్గూసన్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ పేరిట ఉండేది.
పనామాపై సాద్ బిన్ జఫర్ 4 మెయిడిన్ ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. అయితే తాజా మ్యాచ్‌లో 4 మెయిడిన్ ఓవర్లతో పాటు 3 వికెట్లు పడగొట్టిన ఫెర్గూసన్.. సాద్ బిన్ జఫర్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో 4 ఓవర్లు మెయిడిన్ వేసిన తొలి బౌలర్‌గా కూడా ఫెర్గూసన్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికి సాధ్యం కాలేదు.
అదేవిధంగా ఓవరాల్‌గా టీ20ల్లో 4కి 4 ఓవర్లు మెయిడిన్ వేసిన రెండో బౌలర్‌గా ఫెర్గూసన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2021లో పనమాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో సాద్ బిన్ జఫర్ 4 ఓవర్లు మెయిడిన్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు.