
భారత ఫుట్‌బాల్ టీమ్‌కు కొత్త కోచ్ వచ్చాడు. స్పెయిన్‌కు చెందిన మనోలో మార్క్వెజ్‌ను టీమ్ హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) శనివారం ప్రకటించింది. 55 ఏళ్ల మార్క్వెజ్ ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) టీమ్ ఎఫ్‌సీ గోవాకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
అయితే 2024–25 సీజన్‌లో ఆయన ఇటు భారత జట్టుతో పాటు అటు ఎఫ్‌సీ గోవా కోచ్‌గా కూడా రెండు బాధ్యతలను నిర్వర్తిస్తారని ఏఐఎఫ్‌ఎఫ్ వెల్లడించింది. కోచ్‌గా యూఈఎఫ్‌ఏ ప్రొ లైసెన్స్ ఉన్న మార్క్వెజ్ పదవీకాలంపై ఫెడరేషన్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు.
వియత్నాం, లెబనాన్‌లతో వచ్చే అక్టోబరులో జరిగే మూడు దేశాల టోర్నీనుంచి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారు. 2020 నుంచి భారత్‌లో మార్క్వెజ్ కోచింగ్ కొనసాగుతోంది. ఎఫ్‌సీ గోవాకు కోచ్‌గా మారక ముందు ఐఎస్‌ఎల్‌లో ఆయన హైదరాబాద్ ఎఫ్‌సీకి కోచ్‌గా పని చేశారు.
మార్క్వెజ్ నేతృత్వంలోనే 2021–22లో హైదరాబాద్ ఐఎస్‌ఎల్ చాంపియన్‌గా నిలవడం విశేషం. స్పెయిన్‌లో కోచ్‌గా మార్క్వెజ్ అపార అనుభవం ఉంది. పలు స్థానిక క్లబ్‌లతో పాటు లా లిగా జట్టు లాస్ పామాస్‌కు కూడా కోచ్‌గా పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment