అరివీర భయంకర ఫామ్‌లో మయాంక్‌ అగర్వాల్‌.. ఐదింట నాలుగు శతకాలు | Mayank Agarwal Hammers His 4th Ton Of VHT | Sakshi
Sakshi News home page

అరివీర భయంకర ఫామ్‌లో మయాంక్‌ అగర్వాల్‌.. ఐదింట నాలుగు శతకాలు

Published Sun, Jan 5 2025 6:35 PM | Last Updated on Sun, Jan 5 2025 6:35 PM

Mayank Agarwal Hammers His 4th Ton Of VHT

ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌ హజారే ట్రోఫీలో టీమిండియా ఆటగాడు, కర్ణాటక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (Mayank Agarwal) అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో మయాంక్‌ గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాదాడు. ఇందులో హ్యాట్రిక్‌ సెంచరీలు సహా  ఓ హాఫ్‌ సెంచరీ ఉంది.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 139 పరుగులు చేసిన మయాంక్‌.. ఆతర్వాత అరుణాచల్‌ ప్రదేశ్‌పై 100 నాటౌట్‌గా నిలిచాడు. దీని తర్వాత హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 పరుగులు చేసిన మయాంక్‌ హ్యాట్రిక్‌ సెంచరీలు నమోదు చేశాడు. అనంతరం సౌరాష్ట్రపై హాఫ్‌ సెంచరీ (69) చేసిన మయాంక్‌.. తాజాగా నాగాలాండ్‌పై 116 నాటౌట్‌గా నిలిచాడు.

విజయ్‌ హజారే ట్రోఫీ ప్రస్తుత ఎడిషన్‌లో మయాంక్‌ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, హాఫ్‌ సెంచరీ సాయంతో 613 పరుగులు చేశాడు. వీహెచ్‌టీ 2024-25లో మయాంక్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో మయాంక్‌ 153.25 సగటున     111.66 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. ఇందులో 66 బౌండరీలు, 18 సిక్సర్లు ఉన్నాయి.

నాగాలాండ్‌తో మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బౌలింగ్‌ చేసిన కర్ణాటక నాగాలాండ్‌ను 48.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌట్‌ చేసింది. శ్రేయస్‌ గోపాల్‌ 4, అభిలాశ్‌ షెట్టి 2, కౌశిక్‌, హార్దిక్‌ రాజ్‌, విద్యాధర్‌ పాటిల్‌, నికిన్‌ జోస్‌ తలో వికెట్‌ తీసి నాగాలాండ్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. నాగాలాండ్‌ ఇన్నింగ్స్‌లో చేతన్‌ బిస్త్‌ (77 నాటౌట్‌), కెప్టెన్‌ జోనాథన్‌ (51) అర్ద సెంచరీలు సాధించారు. వీరిద్దరు మినహా నాగాలాండ్‌ ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ స్కోర్లేమీ లేవు.

207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 37.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మయాంక్‌ సూపర్‌ సెంచరీతో అలరించగా.. అనీశ్‌ కేవీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. కర్ణాటక ఇన్నింగ్స్‌లో నికిన్‌ జోస్‌ 13 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. నికిన్‌ జోస్‌ వికెట్‌ లెమ్టూర్‌కు దక్కింది. ఈ గెలుపుతో కర్ణాటక గ్రూప్‌-సిలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ టోర్నీలో కర్ణాటక ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట విజయాలు సాధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement