నేనేం చేయాలి.. నన్నెందుకు చూస్తున్నావు?: వాషీపై రోహిత్‌ ‘ఫైర్‌’! | Merko Kya Dekh Raha Hai: Rohit Sharma One Liner To Washington Sundar During IND Vs SL 1st ODI, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Rohit Sharma Viral Video: నేనేం చేయాలి.. నన్నెందుకు చూస్తున్నావు?: వాషీపై రోహిత్‌ ‘ఫైర్‌’!

Published Fri, Aug 2 2024 7:40 PM | Last Updated on Fri, Aug 2 2024 8:01 PM

Merko Kya Dekh Raha Hai: Rohit Sharma One Liner to Washington Goes Viral

వాషీ- రోహిత్‌ (PC: Sonyliv X Video Grab)

దాదాపు నెల రోజుల విశ్రాంతి తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పునరాగమనం చేశాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం నాటి తొలి మ్యాచ్‌ సందర్భంగా మైదానంలో దిగాడు. కొలంబోలోని ఆర్‌. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ వన్డేలో ఆతిథ్య శ్రీలంక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో భారత జట్టు బౌలింగ్‌కు దిగగా.. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆదిలోనే వికెట్‌ తీశాడు. లంక ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో(1) రూపంలో టీమిండియాకు తొలి వికెట్‌ అందించాడు. అనంతరం.. శివం దూబే కుశాల్‌ మెండిస్‌(14), అక్షర్‌ పటేల్‌ సమరవిక్రమ(8) వికెట్లు తీయగా.. కుల్దీప్‌ యాదవ్‌ చరిత్‌ అసలంక(14)ను పెవిలియన్‌కు పంపాడు.

ఇక స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ 27వ ఓవర్‌ మూడో బంతికి.. హాఫ్‌ సెంచరీ వీరుడు పాతుమ్‌ నిసాంక(56)ను అవుట్‌ చేసి మంచి బ్రేక్‌ ఇచ్చాడు. అయితే, 29వ ఓవర్లో వాషింగ్టన్‌ సుందర్‌ చేసిన పనికి.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ హైలైట్‌గా నిలిచింది. దునిత్‌ వెల్లలగే క్రీజులో ఉన్న సమయంలో(28.5) సుందర్‌ గంటకు 91 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు.

ఈ క్రమంలో షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన వెల్లలగే విఫలమయ్యాడు. అయితే, బాల్‌ బ్యాట్‌ కంటే ప్యాడ్‌కు ముందు తాకిందని భావించిన వాషీ.. లెగ్‌ బిఫోర్‌ వికెట్(ఎల్బీడబ్ల్యూ)‌ కోసం అప్పీలు చేశాడు. అయితే, అంపైర్‌ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

దీంతో..స్లిప్‌లో ఉన్న కెప్టెన్‌ రోహిత్ శర్మ వైపు చూసిన వాషీ.. అతడి గైడెన్స్‌ కావాలన్నట్లుగా సైగ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘ఏంటి? నువ్వే చెప్పాలి కదా!... అయినా నాకేం కనిపిస్తుందని నన్ను అడుగుతున్నావు? నువ్వు చేయాల్సిన పని కూడా నేనే చేయాలా? ’’ అంటూ సరదాగా కసురుకున్నాడు. స్టంప్‌ మైకులో ఈ వ్యాఖ్యలు రికార్డు అయ్యాయి. 

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 230 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ రెండేసి వికెట్లు తీయగా.. శివం దూబే, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement