సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ఫైనల్లోకి ముంబై ఇండియన్స్‌ | MI Cape Town Enters Into SA20 2025 Final, Defeat Paarl Royals By 39 Runs, Check Full Score Details Inside | Sakshi
Sakshi News home page

SA20 2025: సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ఫైనల్లోకి ముంబై ఇండియన్స్‌

Published Wed, Feb 5 2025 8:22 AM | Last Updated on Wed, Feb 5 2025 8:31 AM

MI Cape Town Enters Into SA20 2025 Final

ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) ఫ్యామిలీకి చెందిన ఎంఐ కేప్‌టౌన్‌ (MI Cape Town) తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) ఫైనల్‌కు చేరింది. నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఎంఐ కేప్‌టౌన్‌ పార్ల్‌ రాయల్స్‌పై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ప్రస్తుత సీజన్‌లో ఎంఐకు ఇది మూడో అత్యధిక స్కోర్‌. 

ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ర్యాన్‌ రికెల్టన్‌ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్‌ డర్‌ డస్సెన్‌ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా డెవాల్డ్‌ బ్రెవిస్‌ (30 బంతుల్లో 44 నాటౌట్‌; 4 సిక్సర్లు), జార్జ్‌ లిండే (14 బంతుల్లో 26; 3 సిక్సర్లు), డెలానో పోట్‌గెటర్‌ (17 బంతుల్లో 32 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. రాయల్స్‌ బౌలర్లలో దునిత్‌ వెల్లలగే 2, ఫోర్టుయిన్‌, డేవిడ్‌ గేలియమ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌.. ఎంఐ బౌలర్లు కలిసికట్టుగా సత్తా చాటడంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. ట్రెంట్‌ బౌల్ట్‌, కగిసో రబాడ, కార్బిన్‌ బాష్‌, కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్‌ లిండే ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ మిల్లర్‌ (45) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. దినేశ్‌ కార్తీక్‌ (31) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. 

ఛేదనలో రాయల్స్‌ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన రషీద్‌ ఖాన్‌ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్‌కు చేరేందుకు రాయల్స్‌కు మరో అవకాశం ఉంటుంది.  రేపు (ఫిబ్రవరి 6) జరుగబోయే క్వాలిఫయర్‌-2లో రాయల్స్‌.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. 

ఇవాళ (ఫిబ్రవరి 5) జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌.. జోబర్గ్‌ సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. గత రెండు సీజన్లలో టేబుల్‌ లాస్ట్‌లో నిలిచిన ఎంఐ కేప్‌టౌన్‌ తొలిసారి ఫైనల్‌కు చేరింది. సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌ రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement