అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) తొలి సీజన్ నిన్నటి (జులై 13) నుంచి ప్రారంభమైంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్.. లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌పై విజయఢంకా మోగించింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ప్రారంభమైన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 69 పరుగుల తేడాతో గెలుపొంది, ఎంఎల్‌సీ-2023లో బోణీ విజయం దక్కించుకుంది.
మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. కాన్వే సూపర్ ఫిఫ్టి.. బ్రేవో మెరుపులు
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. కాన్వే (37 బంతుల్లో 55; 7 ఫోర్లు, సిక్స్), డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 61; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21; 2 సిక్సర్లు), డ్వేన్ బ్రేవో (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. నైట్‌రైడర్స్ బౌలరల్లో అలీ ఖాన్, లోకీ ఫెర్గూసన్ తలో 2 వికెట్లు.. సునీల్ నరైన్, ఆడమ్ జంపా చెరో వికెట్ దక్కించుకున్నారు.
రసెల్ పోరాటం వృధా..
182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. సూపర్ కింగ్స్ బౌలర్ల ధాటికి 14 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. సూపర్ కింగ్స్ స్పిన్నర్ మొహమ్మద్ మొహిసిన్ (4/8) నైట్‌రైడర్స్ పతనాన్ని శాశించగా.. గెరాల్డ్ కొయెట్జీ, రస్టీ థెరన్ తలో 2 వికెట్లు, కాల్విన్ సావేజ్, డ్వేన్ బ్రేవో చెరో వికెట్ పడగొట్టారు.
నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కడుతుంటే విండీస్ విధ్వంసర వీరుడు ఆండ్రీ రసెల్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. జస్కరన్ మల్హోత్రా (22), సునీల్ నరైన్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మార్టిన్ గప్తిల్ (0), ఉన్ముక్త్ చంద్ (4), రిలీ రొస్సో (4), జంపా (3), ఫెర్గూసన్ (1) నిరాశపరిచారు.
కాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే ఎంఎల్‌సీ జట్లను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను, కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం.. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌ను సొంతం చేసుకున్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (భారతకాలమానం ప్రకారం) సీటిల్ ఓర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లు.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్లు తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment