గుజరాత్‌పై ముంబై 7 వికెట్లతో ఘనవిజయం
మహిళల ప్రీమియర్ లీగ్
న్యూఢిల్లీ: భారీ స్కోర్ల మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 95 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసం ముంబై ఇండియన్స్‌ను గెలిపించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో శనివారం జరిగిన పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. ముందుగా గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దయాళన్ హేమలత (40 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ బెత్ మూనీ (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు.
వీరిద్దరు రెండో వికెట్‌కు 10.2 ఓవర్లలోనే 121 పరుగులు జోడించారు. మూనీ 27 బంతుల్లో, హేమలత 28 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఒక దశలో ఓవర్‌కు పది పరుగుల పైచిలుకు దూసుకెళ్లిన రన్‌రేట్... తర్వాత ఓవర్‌కు ఒక వికెట్ చొప్పున కోల్పోవడంతో నెమ్మదించింది. సైకా ఇషాక్ 2 వికెట్లు తీసింది. అనంతరం ముంబై 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు యస్తిక భాటియా (36 బంతుల్లో 49; 8 ఫోర్లు, 1 సిక్స్), హేలీ మాథ్యూస్ (18; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 50 పరుగులతో శుభారంభం ఇచ్చారు.
వీళ్లిద్దరితో పాటు నట్ సీవర్ బ్రంట్ (2) వికెట్‌నూ వంద పరుగుల్లోపే కోల్పోయిన ముంబై కష్టాల్లో పడింది. 15.4 ఓవర్లలో ముంబై స్కోరు 121/3. విజయానికి 26 బంతుల్లో 70 పరుగులు కావాలి. ఈ దశలో హర్మన్‌ప్రీత్ (వ్యక్తిగత స్కోరు 29 బంతుల్లో 40) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను బౌండరీ వద్ద లిచ్‌ఫీల్డ్ జారవిడిచింది. దీనిని సద్వినియోగం చేసుకున్న హర్మన్ ఆ తర్వాత విధ్వంసకరంగా ఆడింది. చేయాల్సిన 70 పరుగుల్లో ఆమె ఒక్కతే 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు (19 బంతుల్లో) సాధించడంతో ముంబై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment