42 పరుగులతో యూపీ వారియర్స్‌పై గెలుపు
రాణించిన బ్రంట్, అమెలియా, సైకా
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో ముంబై ఇండియన్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన ఈ పోరులో ముంబై 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు యస్తిక భాటియా (9), హేలీ మాథ్యూస్ (4) నిరాశ పరిచినప్పటికీ తర్వాత వచ్చిన టాపార్డర్ బ్యాటర్ నటాలీ సీవర్ బ్రంట్ (31 బంతుల్లో 45; 8 ఫోర్లు) ధాటిగా ఆడింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టింది. అనంతరం అమెలియా కెర్ (23 బంతుల్లో 39; 6 ఫోర్లు), సజీవన్ సజన (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) స్కోరు వేగాన్ని పెంచారు. చమరి ఆటపట్టు 2 వికెట్లు తీసింది. తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలింగ్‌కు యూపీ ఏ దశలోనూ ఎదురునిలువలేకపోయింది. ఆరంభంలోనే టాపార్డర్ వికెట్లను 15 పరుగుల స్కోరు వద్దే కోల్పోయింది.
కెప్టెన్ అలీసా హీలీ (3), కిరణ్ నవ్‌గిరే (7), చమరి ఆటపట్టు (3) నిరాశపరిచారు. క్రీజులోకి వచ్చిన 11 మందిలో గ్రేస్ హారిస్ (15), శ్వేత సెహ్రావత్ (17) మినహా ఏకంగా 8 మంది సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో దీప్తి శర్మ (36 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసిన ఒంటరి పోరాటం సరిపోలేదు. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ (3/27) యూపీని దెబ్బ తీయగా, నాట్ సీవర్ 2 వికెట్లు పడగొట్టింది. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment