NCA email claims Shreyas Iyer "fit and available": ‘‘జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాలంటే.. ముఖ్యంగా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా రంజీలు ఆడాల్సిందే’’.. టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారడన్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా జారీ చేసిన అల్టిమేటం.
ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న ఆటగాళ్లు తప్ప ప్రతి ఒక్కరు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని జై షా కుండబద్దలు కొట్టాడు. అయినా.. ఇషాన్ బోర్డు ఆదేశాలను పట్టించుకోలేదు. డొమెస్టిక్ టీమ్ జార్ఖండ్ తరఫున బరిలో దిగనూ లేదు.
తాజాగా శ్రేయస్ అయ్యర్ కూడా బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇషాన్‌లా నేరుగా కాకుండా ‘ఫిట్‌నెస్’ను అడ్డుపెట్టుకుని నాటకాలకు తెరతీశాడంటూ ప్రచారం జరుగుతోంది. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రంజీ 2023-24 సీజన్‌లో ముంబై తరఫున బరిలో దిగాడు అయ్యర్.
ఆ తర్వాత టీమిండియాతో చేరాడు. కానీ.. తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టు నుంచి అయ్యర్‌ను తప్పించగా.. వెన్నునొప్పి కారణంగానే అతడు జట్టుకు దూరమయ్యాడని వార్తలు వినిపించాయి.
వెన్నునొప్పి.. ఆడలేను
ఆ తర్వాత నాలుగో టెస్టుకు ప్రకటించిన జట్టులోనూ అతడు చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో ముంబై తరఫున క్వార్టర్ ఫైనల్స్‌లో బరిలోకి దిగాలని బోర్డు ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాను వెన్నునొప్పితో బాధపడుతున్న కారణంగా రంజీ మ్యాచ్ ఆడలేనని శ్రేయస్ అయ్యర్ ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు చెప్పినట్లు సమాచారం.
ఈ క్రమంలో బరోడాతో ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానున్న క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌కు అయ్యర్‌ను ఎంపిక చేయలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడని జాతీయ క్రికెట్ అకాడమీ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం.
అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ముగిసిన తర్వాత అతడు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడని రిపోర్టు ఇచ్చాం. తాజాగా అతడు ఎటువంటి గాయాల బారిన పడలేదు.
టీమిండియా నుంచి నిష్క్రమించిన తర్వాత కూడా అతడికి ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవు’’ అని ఎన్సీఏ స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ హెడ్ నితిన్ పటేల్ తన ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం.. ఫిట్‌గా ఉన్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ రంజీ బరి నుంచి వైదొలగడానికి నాటకం ఆడాడనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల్లో అయ్యర్ చేసిన స్కోరు వరుసగా.. 35, 13, 27, 29.
చదవండి: Virat Kohli- Akaay: కోహ్లి కొడుకుకి బ్రిటన్ పౌరసత్వం?!.. అందుకే లండన్‌లో..?
Comments
Please login to add a commentAdd a comment