నవీన్‌కు గట్టి షాక్‌.. ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌! అయ్యో పాపం.. | Naveen Ul Haq Cryptic Post After Being Snubbed From Afghanistan Asia Cup Squad, See How Kohli Fans Reacted - Sakshi
Sakshi News home page

NO Kohli Vs Naveen!: నవీన్‌కు గట్టి షాక్‌.. ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌! అయ్యో పాపం అంటున్న కోహ్లి ఫ్యాన్స్‌

Published Mon, Aug 28 2023 2:53 PM | Last Updated on Mon, Aug 28 2023 3:35 PM

Never Mistake It For Light: Naveen ul Haq Cryptic Post After Asia Cup Snub - Sakshi

గౌతం గంభీర్‌తో నవీన్‌ ఉల్‌ హక్‌ (PC: IPL/LSG)

Naveen ul Haq’s Cryptic Post: ఆసియా కప్‌-2023 నేపథ్యంలో యువ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌కు అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు గట్టి షాకిచ్చింది. పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో అతడిని పక్కనపెట్టి మెగా టోర్నీలో అవకాశం లేదని సంకేతాలు ఇచ్చిన మేనేజ్‌మెంట్‌.. ఇప్పుడు ఆ మాటను నిజం చేసింది. వన్డే ఈవెంట్‌లోకు ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో నవీన్‌కు స్థానం ఇవ్వలేదు.

కింగ్‌ కోహ్లి ఫ్యాన్స్‌ వ్యంగ్యాస్త్రాలు
ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి అభిమానులు నవీన్‌ ఉల్‌ హక్‌ను సోషల్‌ మీడియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. అయ్యో పాపం నవీన్‌..! మరేం పర్లేదు నీకు మంచే జరిగింది. ఒకవేళ ఆసియా కప్‌లో గనుక ఇండియా- అఫ్గనిస్తాన్‌ మ్యాచ్‌లో నీకు చోటు దక్కి ఉంటే కచ్చితంగా కోహ్లి బ్యాటింగ్‌ విధ్వంసానికి బలైపోయేవాడివి. 

ఈసారి తప్పించుకున్నావు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మేరకు కామెంట్లు, మీమ్స్‌తో ఈ అఫ్గన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ పేరును ట్రెండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌ జట్టు ప్రకటన నేపథ్యంలో నవీన్‌ ఉల్‌ హక్‌ ఇన్‌స్టా పోస్ట్‌ సైతం నెట్టింట వైరల్‌గా మారింది.

బాగా హర్ట్‌ అయ్యాడు
‘‘చీకటిని చూసేందుకు నీ కళ్లు ఎంతగా అలవాటు పడిపోయినా పర్లేదు. అయితే, వెలుగును చూసేందుకే ఇలా చేస్తున్నాయని మాత్రం నువ్వు అనుకుంటే అది పొరపాటే’’ అని నవీన్‌ ఉల్‌ హక్‌ పేర్కొన్నాడు. అఫ్గనిస్తాన్‌ సెలక్టర్లను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే తాను హర్ట్‌ అయినట్లు చెప్పాడు. దీంతో అతడి అభిమానులు.. ‘‘బాధపడకు భాయ్‌.. మనకంటూ తప్పక ఓ రోజు వస్తుంది’’ అని అండగా నిలుస్తున్నారు.

కింగ్‌ కోహ్లి ఫ్యాన్స్‌ మాత్రం.. ‘‘అయ్యో పాపం’’ అంటూ సెటైరికల్‌ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2023తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన నవీన్‌ ఉల్‌ హక్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ సందర్భంగా రన్‌మెషీన్‌ కోహ్లితో వాగ్వాదానికి దిగాడు.

గంభీర్‌ ఎంట్రీతో ముదిరిన వివాదం
వీరిద్దమరి మధ్య జరిగిన గొడవలో అప్పటి లక్నో మెంటార్‌ గౌతం గంభీర్‌ కూడా జోక్యం చేసుకోవడంతో వివాదం పెద్దదైంది. ఈ నేపథ్యంలో.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ చేరడంలో విఫలం కావడంతో కోహ్లి ఇన్నింగ్స్‌ను ఉద్దేశించి నవీన్‌.. ‘‘తియ్యటి మామిడి పండ్లు’’ అంటూ చేసిన పోస్ట్‌ కింగ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహానికి కారణమైంది.

ఇక నవీన్‌ దురుసు ప్రవర్తనకు కోహ్లి కూడా నర్భగర్భంగానే ఘాటు వ్యాఖ్యలతో సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్లు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్‌, శ్రీలంక వేదికలుగా ఆసియా వన్డే కప్‌ ఆరంభం కానుంది. భారత్‌, పాకిస్తాన్‌, నేపాల్‌.. శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ఈ టోర్నీలో టైటిల్‌ కోసం తలపడనున్నాయి.

ఆ తర్వాత అఫ్గన్‌ తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా
కాగా 2016లో బంగ్లాదేశ్‌తో వన్డే సందర్భంగా నవీన్‌ ఉల్‌ హక్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. రెండేళ్ల తర్వాత టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. అఫ్గనిస్తాన్‌ తరఫున ఇప్పటి వరకు ఈ 23 ఏళ్ల రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ 7 వన్డేలు, 27 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 14, 34 వికెట్లు పడగొట్టాడు. కోహ్లితో వివాదం తర్వాత అంటే ఐపీఎల్‌-2023 ముగిసిన తర్వాత అఫ్గన్‌ తరఫున నవీన్‌కు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాకపోవడం గమనార్హం.

ఆసియా కప్‌-2023: అఫ్గనిస్తాన్‌ జట్టు
హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ ఖిల్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్‌ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూఖీ, షరాఫుద్దీన్ అష్రఫ్, నూర్ అహ్మద్, అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ సలీం.

చదవండి: ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. విధ్వంసకర ఆటగాడు దూరం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement