టీమిండియాతో సిరీస్‌లో వైట్‌వాష్ అయిన వెస్టిండీస్ ఆటతీరు ఏ మాత్రం మారడం లేదు. ఓడడానికే మ్యాచ్‌లు ఆడుతున్నామా అన్న చందానా విండీస్ ఆటలో 'అదే వ్యథ.. అదే కథ'గా కనిపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ వెస్టిండీస్ పరాజయం పాలైంది. వర్షం అంతరాయం కారణంగా విండీస్ టార్గెట్‌ను 41 ఓవర్లలో 212 పరుగులుగా నిర్ణయించారు. అయితే ఛేధనలో ఏ మాత్రం పోరాటం చూపలేకపోయిన వెస్టిండీస్ 35.3 ఓవర్లలోనే 161 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో కివీస్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మూడు వన్డేల సిరీస్‌లో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే కివీస్ 2-0తో సిరీస్‌ను గెలిచింది. విషయంలోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.2 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బ్యాటర్లలో ఫిన్ అలెన్ 96 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలచాడు. డారిల్ మిచెల్ 41, సాంట్నర్ 26 నాటౌట్ రాణించారు. విండీస్ ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు వర్షం అంతరాయం కలిగించింది.
దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విండీస్ విజయానికి 41 ఓవర్లలో 212 పరుగుల టార్గెట్‌గా నిర్థేశించారు. కానీ విండీస్ టాపార్డర్, మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. టాప్ ఏడుగురు బ్యాటర్లలో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివర్లో యానిక్ కరియా 52, అల్జారీ జోసెఫ్ 49 పరుగులతో పోరాడే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకపోయింది. చివరికి161 పరుగులకు ఆలౌట్ అయింది. 96 పరుగులతో రాణించిన ఫిన్ అలెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య మూడో వన్డే రేపు(ఆదివారం) జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment