పరాభవం... పరిపూర్ణం | Newzeland Becomea First team to inflict a 3-0 whitewash on India in India. | Sakshi
Sakshi News home page

IND Vs NZ: పరాభవం... పరిపూర్ణం

Published Sun, Nov 3 2024 2:05 PM | Last Updated on Mon, Nov 4 2024 3:53 AM

Newzeland Becomea First team to inflict a 3-0 whitewash on India in India.

కివీస్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌

మూడో టెస్టులోనూ టీమిండియా ఓటమి

పంత్‌ పోరాటం వృథా

25 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ విజయం

ఎజాజ్‌ పటేల్‌కు 6 వికెట్లు

3–0తో సిరీస్‌ సొంతం చేసుకున్న లాథమ్‌ బృందం   

టెస్టు క్రికెట్‌ చరిత్రలో టీమిండియా అతిపెద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. 1933 నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడుతున్న భారత జట్టు... 91 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అన్నింటా ఓడిపోయి మొదటిసారి క్లీన్‌ స్వీప్‌నకు గురైంది. 147 పరుగుల లక్ష్యఛేదనలో రిషబ్‌ పంత్‌ మినహా మిగిలిన వారంతా విఫలమవడంతో టీమిండియాకు ఘోర పరాజయం తప్పలేదు. 

రోహిత్‌ బృందం స్వయంకృత అపరాధాలకు మూల్యం చెల్లించుకుంటే... ఇప్పటి వరకు భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలవలేకపోయిన న్యూజిలాండ్‌ ఏకంగా క్లీన్‌స్వీప్‌ చేసి కొత్త చరిత్ర లిఖించింది. గత పర్యటనలో వాంఖడే టెస్టులోనే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసి రికార్డుల్లోకెక్కిన ఎజాజ్‌ పటేల్‌ మరోసారి టీమిండియాను దెబ్బ కొట్టాడు. ఈ ఫలితంతో భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.   

ముంబై: సొంతగడ్డపై తిరుగులేని టెస్టు రికార్డు ఉన్న భారత జట్టుకు అనూహ్య పరాభవం ఎదురైంది. ఇప్పటికే న్యూజిలాండ్‌ చేతిలో టెస్టు సిరీస్‌ కోల్పోయిన టీమిండియా... ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకుంటుంది అనుకుంటే అదీ సాధ్యపడలేదు. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మూడో టెస్టులో చివరకు భారత జట్టు 25 పరుగుల తేడాతో పరాజయం పాలవగా... న్యూజిలాండ్‌ 3–0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత జట్టు సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

భారత పర్యటనకు ముందు శ్రీలంక చేతిలో 0–2తో సిరీస్‌ కోల్పోయి వచ్చిన న్యూజిలాండ్‌... స్టార్‌ ఆటగాళ్లతో నిండిన టీమిండియాపై ఒక టెస్టు మ్యాచ్‌ గెలవడమే గొప్ప అనుకుంటే... వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టి కొత్త చరిత్ర లిఖించింది. ఊరించే లక్ష్యఛేదనలో టాపార్డర్‌ మరోసారి విఫలమవడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఓవర్‌నైట్‌ స్కోరు 171/9తో ఆదివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ మరో మూడు పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో టీమిండియా ముందు 147 పరుగుల విజయలక్ష్యం నిలిచింది.  

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 29.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. రిషబ్‌ పంత్‌ (57 బంతుల్లో 64; 9 ఫోర్లు, ఒక సిక్స్‌) ఒక్కడే అర్ధశతకంతో ఆకట్టుకోగా... మిగిలిన వాళ్లంతా పెవిలియన్‌కు వరుస కట్టారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఎజాజ్‌ పటేల్‌ 6, గ్లెన్‌ ఫిలిప్స్‌ 3 వికెట్లు పడగొట్టారు. వాంఖడే స్టేడియంలో ఆడిన రెండు టెస్టుల్లోనే ఎజాజ్‌ పటేల్‌ 25 వికెట్లు పడగొట్టడం విశేషం. భారత్‌లోని ఓ వేదికపై ఓ విదేశీ బౌలర్‌కు ఇదే అత్యుత్తమ రికార్డు. 

గతంలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఇయాన్‌ బోథమ్‌ వాంఖడేలోనే రెండు మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి 11 వికెట్లు తీసిన ఎజాజ్‌ పటేల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, విల్‌ యంగ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి. 

కొంతే కొండంతై.. 
పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్‌... రెండు ఫోర్లతో ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే ఆరంభించినా... ఆ తర్వాత నిర్లక్ష్యపు షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. మరుసటి ఓవర్‌లో గిల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన ఎజాజ్‌ పటేల్‌... తన తదుపరి ఓవర్‌లో కోహ్లిని బుట్టలో వేసుకున్నాడు. 

తదుపరి ఓవర్‌లో జైస్వాల్‌ కూడా వెనుదిరగగా... సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఫలితంగా 7.1 ఓవర్లలోనే టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత ఇన్నింగ్స్‌ బాధ్యతను పంత్‌ తీసుకున్నాడు.  

పంత్‌ ఒంటరి పోరు.. 
అత్యవసరమైన స్థితిలో ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించిన పంత్‌ మరోసారి తుదికంటా పోరాడాడు. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి సహచర ఆటగాళ్లు నిలవలేకపోతున్న చోట ఎజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో ఖాతా తెరిచిన రిషబ్‌... మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు కోల్పోతున్నా మొండిగా క్రీజులో నిలిచాడు. 

ఫిలిప్స్‌ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన పంత్‌.. ఆ తర్వాత మరో రెండు బౌండరీలతో లక్ష్యాన్ని కరిగించే పనిలో పడ్డాడు. ఆరో వికెట్‌కు 42 పరుగులు జోడించిన అనంతరం జడేజా అవుట్‌ కాగా... ఆ తర్వాత సుందర్‌ అండగా పంత్‌ ముందుకు సాగాడు. ఈ క్రమంలో పటేల్‌ ఓవర్‌లో రెండు ఫోర్లతో 48 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

లంచ్‌ విరామానికి టీమిండియా 92/6తో నిలిచింది. ఆ తర్వాత ఎజాజ్‌ పటేల్‌ భారత్‌కు భారీ షాక్‌ ఇచ్చాడు. తన ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన పంత్‌ను కీపర్‌ క్యాచ్‌ ద్వారా వెనక్కి పంపాడు. మొదట అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా... రివ్యూకు వెళ్లిన కివీస్‌ ఫలితం రాబట్టింది.  పంత్‌ అవుటయ్యాక భారత్‌ ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.  

1 స్వదేశంలో భారత జట్టు మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ కావడం ఇదే తొలిసారి. 2000లో దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0–2తో కోల్పోయిన టీమిండియా... 1980లో ఇంగ్లండ్‌ చేతిలో 0–1తో ఓడింది. సొంతగడ్డపై ఒక సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఓడటం 1983 తర్వాత ఇదే తొలిసారి.  

1 ఒక టెస్టు సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు గెలవడం న్యూజిలాండ్‌కు ఇదే మొదటిసారి.

31- 1 సొంతగడ్డపై 200 పరుగులలోపు లక్ష్యఛేదనలో భారత్‌ విఫలమవడం ఇదే తొలిసారి. గతంలో 31 సార్లు లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన భారత్‌ ఈసారి విఫలమైంది.

2 ఓవరాల్‌గా టెస్టుల్లో భారత జట్టు ఛేదించలేకపోయిన రెండో అత్యల్ప స్కోరు ఇది. 1997లో బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 120 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 81 పరుగులకు ఆలౌటైంది.

5 స్వదేశంలో అత్యధిక టెస్టు పరాజయాలు మూటగట్టుకున్న సారథుల జాబితాలో రోహిత్‌ శర్మ రెండో స్థానానికి చేరాడు. మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ కెపె్టన్‌గా స్వదేశంలో 9 మ్యాచ్‌లు ఓడగా... రోహిత్‌ 5 మ్యాచ్‌ల్లో పరాజయం పాలయ్యాడు. అజహరుద్దీన్, కపిల్‌దేవ్‌ 4 ఓటములతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు.  

స్కోరు వివరాలు 
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 235; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 263; న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 174; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (ఎల్బీ) (బి) ఫిలిప్స్‌ 5; రోహిత్‌ (సి) ఫిలిప్స్‌ (బి) హెన్రీ 11; గిల్‌ (బి) ఎజాజ్‌ 1; కోహ్లి (సి) మిచెల్‌ (బి) ఎజాజ్‌ 1; పంత్‌ (సి) బ్లన్‌డెల్‌ (బి) ఎజాజ్‌ 64; సర్ఫరాజ్‌ (సి) రచిన్‌ (బి) ఎజాజ్‌ 1; జడేజా (సి) యంగ్‌ (బి) ఎజాజ్‌ 6; సుందర్‌ (బి) ఎజాజ్‌ 12; అశి్వన్‌ (సి) బ్లన్‌డెల్‌ (బి) ఫిలిప్స్‌ 8; ఆకాశ్‌దీప్‌ (బి) ఫిలిప్స్‌ 0; సిరాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 12, మొత్తం (29.1 ఓవర్లలో ఆలౌట్‌) 121. వికెట్ల పతనం: 1–13, 2–16, 3–18, 4–28, 5–29, 6–71, 7–106, 8–121, 9–121, 10– 121. బౌలింగ్‌: హెన్రీ 3–0–10–1; ఎజాజ్‌ 14.1–1–57–6; ఫిలిప్స్‌ 12–0–42–3.  

ఓటమికి బాధ్యత నాదే... 
ఈ పరాజయాన్ని జీర్ణించుకోవడం కష్టం. నా కెరీర్‌లో ఇదే అధమ దశ. టెస్టు సిరీస్‌ పరాజయానికి కెపె్టన్‌గా పూర్తి బాధ్యత నాదే. జట్టుగా అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయాం. గెలుస్తామనుకున్న మ్యాచ్‌ను కోల్పోయాం. మా స్థాయికి తగ్గ క్రికెట్‌ను ఆడలేదు. బెంగళూరు, పుణే టెస్టుల్లో మొదటి ఇన్నింగ్స్‌ల్లో తగిన స్కోర్లు చేయలేక వెనుకబడ్డాం. 

మూడో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించి కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం బాధిస్తోంది. బ్యాటర్‌గా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. సారథిగానూ జట్టును విజయం దిశగా నడిపించలేకపోయా. న్యూజిలాండ్‌ జట్టు  మెరుగైన ప్రదర్శన కనబర్చింది. 

బ్యాటింగ్‌కు క్లిష్టతరమైన పిచ్‌పై యువ ఆటగాళ్లు శుబ్‌మన్‌ గిల్, రిషబ్‌ పంత్‌ చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఇక నా దృష్టి అంతా ఆ్రస్టేలియా సిరీస్‌పైనే. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టి ఆసీస్‌పై మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం. గత రెండు పర్యటనల్లోనూ ఆసీస్‌పై సిరీస్‌లు గెలిచాం. ఈసారి కూడా మెరుగైన ఆటతీరు కనబరుస్తామనే నమ్మకముంది. –రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement