క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒకనాటి సహచరుడు, టీమిండియా మాజీ ఆటగాడు ప్రశాంత్ వైద్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో నాగ్‌పూర్ పోలీసులు (బజాజ్ నగర్) వైద్యను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు వైద్యను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా.. పూచికత్తుపై అతన్ని విడుదల చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారిని చీట్ చేసిన కేసులో పోలీసులు ఈ మాజీ క్రికెటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్‌కు చెందిన వ్యాపారి నుంచి వైద్య 1.9 కోట్లు విలువ చేసే స్టీల్ కొనుగోలు చేసి, అందుకు బదులుగా చెక్‌లకు ఇచ్చాడు. అయితే చెక్‌లు బౌన్స్ కావడంతో సదరు వ్యాపారి వైద్యను పలు మార్లు నగదు చెల్లించాల్సిందిగా కోరాడు. డబ్బు చెల్లించాలని వైద్యను ఎన్ని సార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో ఆ వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు పలు నోటీసులు ఇచ్చిన అనంతరం వైద్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన బజాజ్ నగర్ పోలీసులు వైద్యను అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు.
56 ఏళ్ల ప్రశాంత్ వైద్య 1995-96 మధ్యలో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలతో కలిసి 4 వన్డే మ్యాచ్‌ల్లో (4 వికెట్లు) టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అప్పట్లో వైద్య భారత జట్టులో ఉత్తమ ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వైద్య మహారాష్ట్రకు చెందినప్పటికీ బెంగాల్ తరఫున దేశవాలీ క్రికెట్ ఆడాడు. వైద్య తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 56 మ్యాచ్‌లు ఆడి 171 వికెట్లు పడగొట్టాడు. వైద్య ప్రస్తుతం విదర్భ క్రికెట్ అసోసియేషన్ డెవలప్‌మెంట్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment