Virat Kohli: సెలవులో ఉన్న కోహ్లి.. విష ప్రచారం! | DeepFake Alert: Virat Kohli Become Deepfake AI Video Victim After Sachin | Sakshi
Sakshi News home page

DeepFake: సెలవులో ఉన్న విరాట్‌ కోహ్లి.. విష ప్రచారం!

Published Tue, Feb 20 2024 11:26 AM | Last Updated on Tue, Feb 20 2024 11:53 AM

DeepFake Alert: Virat Kohli Become Deepfake AI Video Victim After Sachin - Sakshi

భార్య అనుష్కతో విరాట్‌ కోహ్లి (PC: Virat Kohli Insta)

Virat Kohli- Deepfake: సులభంగా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కే సైబర్‌ నేరగాళ్లు సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసి నకిలీ వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వదులుతున్నారు. 

ప్రముఖ హీరోయిన్‌ రష్మిక మందన్న డీప్‌ఫేక్‌ వీడియో తర్వాత ఈ విపరీత ధోరణి మరింత ఎక్కువైంది. సినీ సెలబ్రిటీలతో పాటు సచిన్‌ టెండుల్కర్‌ వంటి దిగ్గజ క్రికెటర్లను సైతం సైబర్‌ క్రిమినల్స్‌ వదలడం లేదు. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కూడా తాజాగా ఈ బాధిత జాబితాలో చేరాడు. ఓ బెట్టింగ్‌ యాప్‌ను కోహ్లి ప్రమోట్‌ చేస్తున్నట్లు డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌ అవుతోంది.

తాను తక్కువ డబ్బులు పెట్టుబడిగా పెట్టి.. భారీ మొత్తంలో ఆర్జించినట్లు కోహ్లి చెబుతున్నట్లుగా ఉన్న వీడియోను... ఏకంగా ఓ టీవీ చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు క్రియేట్‌ చేశారు సైబర్‌ మాయగాళ్లు.

ఇది నిజమా? ఏఐ మాయా?
గతంలో కోహ్లి ఇచ్చిన ఇంటర్వ్యూలోని మాటలను టెక్నాలజీని ఉపయోగించి తమకు అనుగుణంగా మార్చుకుని.. నిజమైన వీడియో అన్నట్లుగా నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను నెట్టింట షేర్‌ చేసిన ఓ జర్నలిస్టు.. ‘‘నిజంగా విరాట్‌ కోహ్లి ఇలాంటివి ప్రోత్సహిస్తున్నాడా? లేదంటే ఇదంతా ఏఐ(కృత్రిమ మేధ) మాయా? 

ఒకవేళ అదే నిజమైతే.. వీడియో అసలైనదానిలా చిత్రీకరించడంలో సృష్టికర్తలు సఫలమయ్యారు. టెక్నాలజీని మరీ ఇంత దుర్వినియోగం చేస్తారా? ఒకవేళ ఈ వీడియో నిజమే అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు! 

మీలో ఎవరికైనా వాస్తవం ఏమిటో తెలిస్తే చెప్పండి’’ అని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ఇది కచ్చితంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజిన్స్‌ మాయ అని అర్థమవుతోంది’’ అని అభిప్రాయపడుతున్నారు.

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం
కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా విరాట్‌ కోహ్లి స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. కుటుంబానికి సమయం కేటాయించిన అతడు.. సెలవు పొడగించుకున్నాడు. 

ఈ నేపథ్యంలో కోహ్లి నిర్ణయాన్ని గౌరవిస్తామని.. అత్యవసరం అయితే తప్ప ఈ దిగ్గజ బ్యాటర్‌ సెలవు పెట్టడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. ఈ పరిణామాల క్రమంలో కోహ్లి- అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని.. అయితే, ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు తలెత్తాయనే వార్తలు పుట్టుకొచ్చాయి.

ఈ క్రమంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త.. విరుష్క జోడీ లండన్‌లో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారంటూ ట్వీట్‌ చేసి దుమారం రేపారు. ఈ నేపథ్యంలో తాజాగా కోహ్లి పేరిట ఇలాంటి వీడియో ప్రత్యక్షం కావడం గమనార్హం.

చదవండి: రోహిత్‌, కోహ్లిలా హీరో అయ్యే వాడిని.. కానీ ఆరోజు ధోని ఎందుకలా చేశాడో?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement