I am not thinking about an India call-up: టీమిండియాలో చోటు కోసం తాను ఎదురుచూడటం లేదని, ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో రాణించడమే ధ్యేయమని ఆర్సీబీ బ్యాటర్ అనూజ్ రావత్ అన్నాడు. దేశీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో ఆడేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతానని తెలిపాడు.
ఉత్తరాఖండ్‌కు చెందిన 23 ఏళ్ల అనూజ్ దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2023లో ఆర్సీబీకి ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 7 ఇన్నింగ్స్‌లో కలిపి 91 పరుగులు చేయగలిగాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి ఈ మేరకు రన్స్ రాబట్టాడు.
ఉత్తమంగా ఆడొచ్చు
ఇక తాజాగా స్పోర్ట్స్‌కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనూజ్ రావత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నా. ఇప్పుడే జాతీయ జట్టులో చోటు గురించి ఆలోచించడం లేదు.
ముందుగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించాలి. ఈ టీ20 టోర్నీలో మెరుగైన ప్రదర్శన వల్ల ఐపీఎల్‌లో మరింత ఉత్తమంగా ఆడే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ సీనియర్ జట్టు నుంచి తనను తప్పించడంపై అనూజ్ ఈ సందర్భంగా స్పందించాడు.
ఆలస్యంగానైనా
‘‘ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనపుడు మానసికంగా మరింత దృఢంగా ఉండాలి. ఒక్కరోజులో ఏమీ మారిపోదు. తిరిగి జట్టులో చేరే రోజు కోసం ఓపికగా ఎదురుచూడాలి. ఐపీఎల్ కూడా ఉంది. అక్కడ బాగా ఆడితే మున్ముందు మరిన్ని అవకాశాలు వస్తాయి.
మా రాజ్‌కుమార్ సర్ ప్రతిసారి ఓ మాట చెబుతారు. మన ఆట తీరు బాగుంటే కాస్త ఆలస్యంగానైనా అవకాశాలు దక్కుతాయి. నేను అండర్-14, అండర్-16 జట్లకు ఆడేటపుడు షార్ట్‌లిస్ట్‌లో ఉండేవాడిని.
కానీ తుదిజట్టులో మాత్రం నా పేరు ఉండేది కాదు. కానీ నేనెప్పుడూ నమ్మకం కోల్పోలేదు. కఠినంగా శ్రమించి అండర్-19 స్థాయిలో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాను’’ అని అనూజ్ రావత్ చెప్పుకొచ్చాడు. కాగా అనూజ్ రావత్ ఇప్పటి వరకు 19 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 220 పరుగులు సాధించాడు. ఇక ఫస్ట్‌క్లాస్ డెబ్యూ మ్యాచ్‌లో అసోం మీద 71 పరుగులు సాధించాడు అనూజ్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడి సగటు 40.
చదవండి: జింబాబ్వే సంచలనం.. వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు!
ధోని జీవితంలో తీరని విషాదం..! మిస్టర్ కూల్ నాలో ఆ అమ్మాయిని చూస్తాడనుకున్నా..
Comments
Please login to add a commentAdd a comment