అమెరికా ప్లేయర్ రీలీ ఒపెల్కా చేతిలో పరాజయం
బ్రిస్బేన్: కెరీర్‌లో 100వ సింగిల్స్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో కొత్త ఏడాదిలో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు ఆశించిన ఫలితం రాలేదు. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ జొకోవిచ్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ జొకోవిచ్ 6–7 (6/8), 3–6తో అమెరికాకు చెందిన 293వ ర్యాంకర్ రీలీ ఒపెల్కా చేతిలో ఓడిపోయాడు.
2009లో ఒక్కసారి మాత్రమే ఈ టోర్నీలో ఆడి తొలి రౌండ్‌లో ఓడిపోయిన జొకోవిచ్‌కు ఈసారి కూడా టోర్నీ కలిసి రాలేదు. 1 గంట 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒపెల్కా ఏకంగా 16 ఏస్‌లు సంధించాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నారు. నిర్ణాయక టైబ్రేక్‌లో ఒపెల్కా పైచేయి సాధించి తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు.
రెండో సెట్‌లో ఒకసారి జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకున్న ఒపెల్కా తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 102 కేజీల బరువున్న ఒపెల్కా 2022లో కెరీర్ బెస్ట్ 17వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత గాయం కారణంగా 2023లో కేవలం ఒక టోర్నీలోనే ఆడాడు. గాయం నుంచి కోలుకుని 2024లో పలు టోర్నీల్లో ఆడినా ఒక్క టైటిల్ కూడా సాధించకపోవడంతో అతని ర్యాంక్ పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment