
ICC World Cup 2023- Team India: టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్ రానున్నాడా? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ఈ బాధ్యతను తలకెత్తుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియాలో కీలక సభ్యుడైన ఓ ఆటగాడు ఈ మేరకు అగార్కర్ పేరును బోర్డుకు సూచించినట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్-2023 సన్నాహకాల్లో భాగంగా ఈ చర్చ తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెలువరించింది.
ఈ మేరకు... ‘‘ప్రస్తుతం భారత క్రికెట్ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే ఓ సీనియర్ ఆటగాడు... వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో అగార్కర్ వంటి అనుభవజ్ఞుడు.. టీమిండియా బౌలర్లకు మార్గనిర్దేశకుడిగా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. నిజానికి మాంబ్రే మంచి బౌలింగ్ కోచ్. అతడు ఇండియా ఏ, అండర్ 19 ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో తలమునకలై ఉంటే... అగార్కర్ సీనియర్లను చూసుకోవాలని భావిస్తున్నాడు’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు పేర్కొంది. కాగా భారత మాజీ సీమర్ పారస్ మాంబ్రే ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
ఇక అగార్కర్ విషయానికొస్తే.. 44 ఏళ్ల ఈ టీమిండియా మాజీ బౌలర్.. ప్రస్తుతం టీవీ కామెంటేటర్‌గా ఉన్నాడు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి పోటీ పడగా.. చేతన్ శర్మను ఆ పదవి వరించింది. కాగా 1998 నుంచి 2007 వరకు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అగార్కర్ 28 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 349 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 42 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: IPL 2022: రూ. 6.5 కోట్లే దండగ.. మళ్లీ వైస్ కెప్టెన్సీనా!? ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ గరం